తుంగభద్ర తీరంలో అగ్నిప్రమాదం.. హోటల్ గోదాం దగ్ధం

by Vemula.Srinu Prasad |

మంత్రాలయం తుంగభద్ర నది తీరంలో బుధవారం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక హోటల్ వ్యాపారి జంగం రంగస్వామికి చెందిన నిల్వ గోదాం ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకుని పూర్తిగా బూడిదైంది....

తుంగభద్ర తీరంలో అగ్నిప్రమాదం.. హోటల్ గోదాం దగ్ధం
X

దిశ, మంత్రాలయం: మంత్రాలయం తుంగభద్ర నది తీరంలో అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక హోటల్ వ్యాపారి జంగం రంగస్వామికి చెందిన నిల్వ గోదాం ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకుని పూర్తిగా బూడిదైంది. ఈ ప్రమాదంలో సుమారు ఒక లక్ష రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.బాధితుడు రంగస్వామి తన హోటల్ నిర్వహణకు అవసరమైన వస్తువులను భద్రపరుచుకునేందుకు తుంగభద్ర నది తీరం పక్కనే ఉన్న ఒక గోదామును అద్దెకు తీసుకున్నారు. ఇందులో హోటల్ వ్యాపారానికి సంబంధించిన ఫ్రిజ్, గ్రైండర్, విలువైన వంట సామాగ్రితో పాటు భారీగా నిత్యావసర కిరాణా వస్తువులను నిల్వ ఉంచారు. బుధవారం ఈ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో, క్షణాల వ్యవధిలోనే అవి గోదాం మొత్తానికి వ్యాపించాయి. లోపల ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలు, నిత్యావసర సరుకులు అగ్నికి ఆహుతయ్యాయి.

గోదాం నుండి పెద్ద ఎత్తున పొగలు, మంటలు రావడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఎమ్మిగనూరు నుంచి ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమించారు. అయితే అప్పటికే గోదాంలోని సామాగ్రి మొత్తం పూర్తిగా కాలిపోవడంతో వ్యాపారి రంగస్వామికి తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లింది. ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Next Story