భారీ లాభాలు సాధించిన స్టాక్ మార్కెట్లు!

by Disha Web Desk 17 |
భారీ లాభాలు సాధించిన స్టాక్ మార్కెట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుస భారీ పతనాల నుంచి కోలుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. అంతకుముందు ట్రేడింగ్ రోజు నష్టాల నుంచి బయటపడ్డ తర్వాత సూచీలు బుధవారం ఒక్కసారిగా అత్యధిక లాభాలతో ర్యాలీ చేశాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ నెమ్మదిగా సద్దుమణుగుతున్నాయనే అంచనాలతో మదుపర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపించారు. ముఖ్యంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు రష్యాతో నాటో యుద్ధం చేసేందుకు సిద్ధంగా లేదని, కాబట్టి తమకు నాటో సభ్యత్వం అక్కరలేదని తేల్చి చెప్పడంతో స్టాక్ మార్కెట్లకు సానుకూల సంకేతాలు కనిపించాయి. రష్యా ప్రధాన డిమాండ్ అయినా దీనిపై ఉక్రెయిన్ స్పష్టత ఇవ్వడంతో యుద్ధం మరికొద్ది రోజుల్లో ఆగిపోతుందనే ఆశలతో సూచీల్లో ఉత్సాహం పుంజుకుంది. మరోవైపు చమురు ధరలకు సంబంధించి భారత పెట్రోలియం శాఖ నిల్వలపై ఆందోళన వద్దని, చమురు దిగుమతుల సరఫరాలో ఇబ్బందుల్లేవని వెల్లడించింది. అలాగే, అంతర్జాతీయ విమానాలను రెండున్నరేళ్ల తర్వాత పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించడం, దేశంలోని కీలక రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వంటి దేశీయ సంఘటనలతో స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను సాధించాయి.

దీంతో మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,223.24 పాయింట్లు ఎగసి 54,647 వద్ద, నిఫ్టీ 331.90 పాయింట్లు పెరిగి 16,345 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మీడియా ఇండెక్స్ అత్యధికంగా 4 శాతానికి పైగా పుంజుకోగా, ఫైనాన్స్, ఆటో రంగాలు 2 శాతానికి ర్యాలీ చేశాయి. మెటల్ స్వల్పంగా క్షీణించింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో పవర్‌గ్రిడ్, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్, నెస్లె ఇండియా, విప్రో షేర్లు నష్టాలను చూడగా, మిగిలిన అన్ని కంపెనీల షేర్లు లాభపడ్డాయి. ముఖ్యంగా ఏషియన్ పెయింట్స్, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, ఎంఅండ్ఎం, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, మారుతీ సుజుకి, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఆల్ట్రా సిమెంట్, టెక్ మహీంద్రా, టైటాన్, ఎస్‌బీఐ, హిందూస్తాన్ యూనిలీవర్ షేర్లు అధికంగా 2-6 శాతం మధ్య లాభాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 76.58 వద్ద ఉంది.


Next Story