లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

by Disha Web Desk 2 |
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుస నష్టాల నుంచి బయటపడ్డాయి. గతవారం మూడు సెషన్లలో దెబ్బతిన్న సూచీలు సోమవారం నాటి ట్రేడింగ్‌లొ రోజంతా అస్థిరంగా కదలాడినప్పటికీ మిడ్-సెషన్ తర్వాత పుంజుకుని మెరుగైన లాభాలను చూశాయి. ఉదయం ప్రారంభం నుంచి ఒడిదుడుకులను ఎదుర్కొన్న తర్వాత కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపించడం, ముడి చమురు ధరలు నెమ్మదించడం వంటి పరిణామాలు స్టాక్ మార్కెట్లకు కలిసొచ్చాయి. దీనితోడు కమొడిటీ ధరలు తగ్గడంతో ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో పెట్టుబడిదారుల సెంటిమెంట్ బలపడింది.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 326.84 పాయింట్లు ఎగసి 53,234 వద్ద, నిఫ్టీ 83.30 పాయింట్లు పెరిగి 15,835 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఎఫ్ఎంసీజీ అత్యధికంగా 2.6 శాతం, కన్స్యూమర్ డ్యూరబుల్స్, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాలు మెరుగైన లాభాలతో పుంజుకోగా, మెటల్, ఐటీ రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో హిందూస్తాన్ యూనిలీవర్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్‌గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ, భారతీ ఎయిర్‌టెల్ కంపెనీల షేర్లు అధిక లాభాలను చూడగా, టీసీఎస్, టాటా స్టీల్, ఎంఅండ్ఎం, డా రెడ్డీ, టెక్ మహీంద్రా స్టాక్స్ ఎక్కువ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 78.94 వద్ద ఉంది.


Next Story

Most Viewed