లాభాల్లో అదరగొట్టిన మారుతీ సుజుకీ.. ఒక్కో షేరుకు రూ.125 డివిడెండ్

by Disha Web Desk 17 |
లాభాల్లో అదరగొట్టిన మారుతీ సుజుకీ.. ఒక్కో షేరుకు రూ.125 డివిడెండ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజ సంస్థ మారుతీ సుజుకీ తన ఆర్థిక ఫలితాలను విడుదల చేసింది. మార్చి 31, 2024తో ముగిసిన నాలుగో త్రైమాసికానికి కంపెనీ రూ.3,878 కోట్ల నికర లాభాలను సాధించింది. ఇది గత ఏడాది ఇదే కాలంలో రూ.2,624 కోట్లతో పోలిస్తే 48 శాతం ఎక్కువ.. ధరలు అనుకూలంగా ఉండటం వలన అమ్మకాలు పెరగడంతో లాభాలు గణనీయంగా పెరిగాయని అధికారులు తెలిపారు. పూర్తి ఆర్థిక సంవత్సరంలో, పన్ను తర్వాత లాభం రూ. 13,209 కోట్లుగా ఉంది, ఇది గత ఏడాదిలో నివేదించిన రూ. 8,049 కోట్లతో పోలిస్తే 64 శాతం ఎక్కువ. కంపెనీ రాబడి దాదాపు 20 శాతం పెరిగి రూ. 1.40 లక్షల కోట్లకు చేరుకుంది. మారుతీ సుజుకీ అత్యధిక డివిడెండ్‌ను ఒక్కో షేరుకు రూ.125గా ప్రకటించింది.

గత ఆర్థిక సంవత్సరంలో, మారుతీ సుజుకీ ఏటా 20 లక్షల యూనిట్లను విక్రయించింది. బాలెనో, స్విఫ్ట్, ఇన్విక్టో వంటి ఉత్పత్తుల విక్రయాలు మార్చితో ముగిసిన త్రైమాసికంలో 5,84,031 యూనిట్లతో దాదాపు 13 శాతం వృద్ధిని నమోదు చేశాయి. జనవరి-మార్చి త్రైమాసికంలో తక్కువ మెటీరియల్ ఖర్చులతో కంపెనీ మార్జిన్లు మెరుగుపడ్డాయి. దేశీయంగా అమ్మకాలు 5,05,291 యూనిట్లుగా నమోదుకాగా, ఇది సంవత్సరానికి 12 శాతం ఎక్కువ, అలాగే, మొత్తం అమ్మకాల్లో 86.5 శాతం వాటాను కలిగి ఉంది. ఎగుమతులు 78,740 యూనిట్లుగా ఉన్నాయి, ఇది ఏడాది ప్రాతిపదికన 22 శాతం పెరిగింది. మారుతీ సుజుకీ 2030 నాటికి 8 లక్షల యూనిట్ల ఎగుమతి లక్ష్యాన్ని చేరుకోవడానికి కృషి చేస్తుందని ఛైర్మన్ ఆర్‌సి భార్గవ అన్నారు. కంపెనీ ఇటీవల హర్యానాలోని మానేసర్‌ ప్లాంట్‌లో తయారీ సామర్థ్యాన్ని ఏడాదికి 1 లక్ష యూనిట్లకు విస్తరించింది.



Next Story