సీఎం కేజ్రీవాల్‌పై ఎన్‌ఐఏ దర్యాప్తు.. ఎందుకు ?

by Dishanational4 |
సీఎం కేజ్రీవాల్‌పై ఎన్‌ఐఏ దర్యాప్తు.. ఎందుకు ?
X

దిశ, నేషనల్ బ్యూరో : మధ్యంతర బెయిల్‌పై ఆశలు పెట్టుకున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు షాకిచ్చే కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సోమవారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఖలిస్థానీ తీవ్రవాద సంస్థ ‘సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌’ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.133 కోట్లు అందాయంటూ వచ్చిన ఆరోపణలపై ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను విచారించాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు సిఫార్సు చేశారు. దీంతో సార్వత్రిక ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. వరల్డ్‌ హిందూ ఫెడరేషన్‌ నేత అశూ మోంగియా నుంచి తనకు దీనిపై ఫిర్యాదు వచ్చిందని లెఫ్టినెంట్ గవర్నర్ వెల్లడించారు.

టెర్రరిస్ట్ దేవేంద్ర పాల్ భుల్లార్‌ విడుదల కోసం..

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సెక్రటేరియట్ వర్గాల కథనం ప్రకారం.. 1993లో జరిగిన ఢిల్లీ పేలుళ్ల కేసు దోషి, టెర్రరిస్ట్ దేవేంద్ర పాల్ భుల్లార్‌ను విడుదల చేయించడానికి ‘సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌’ నుంచి ఆప్‌ ముడుపులు అందుకుందని అశూ మోంగియా ఫిర్యాదు చేశారు. దేశంలోని పలు రాష్ట్రాలలో ఖలిస్థానీ అనుకూల భావాలను ప్రోత్సహిస్తామనే హామీ ఇవ్వబట్టే ఆప్‌కు ‘సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌’ నుంచి నిధులు అందాయని తెలిపారు. ఈ ఆరోపణలకు సంబంధించి అశూ మోంగియా అందించిన ఎలక్ట్రానిక్ ఆధారాలపై ఫోరెన్సిక్ పరీక్షతో సహా దర్యాప్తు అవసరమన్నారు. టెర్రరిస్ట్ దేవేంద్ర పాల్‌కు రాష్ట్రపతి క్షమాభిక్షపై రాతపూర్వక హామీని డిమాండ్ చేస్తూ 2014 జనవరిలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఇక్బాల్ సింగ్ అనే ఖలిస్థానీ వేర్పాటువాద నేత నిరాహార దీక్షకు దిగారు. అయితే దీనిపై స్పందించిన కేజ్రీవాల్ ఆయనకు లేఖ రాశారు. ‘‘టెర్రరిస్ట్ దేవేంద్ర పాల్ భుల్లార్‌కు క్షమాభిక్ష పెట్టి విడుదల చేయాలని రాష్ట్రపతికి ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం ఇప్పటికే సిఫార్సు చేసింది. ఈ అంశంపై ఢిల్లీలోని తమ సర్కారు ప్రత్యేక దర్యాప్తు టీమ్ (సిట్)‌ను కూడా ఏర్పాటు చేసింది’’ అనే విషయాన్ని తన లేఖలో కేజ్రీవాల్ ప్రస్తావించారని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సెక్రటేరియట్ వర్గాలు తెలిపాయి. కేజ్రీవాల్ నుంచి లేఖ అందిన తర్వాతే ఇక్బాల్ సింగ్ నిరాహార దీక్ష విరమించారని గుర్తు చేశాయి.

ఖలిస్థానీ నేతలతో సీక్రెట్‌ భేటీ

మోస్ట్ వాంటెడ్ ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ వీడియోలను కూడా ‘సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌’ గతంలో ప్రమోట్ చేసిన విషయాన్ని వరల్డ్‌ హిందూ ఫెడరేషన్‌ తన ఫిర్యాదులో పేర్కొంది. 2014 సంవత్సరంలో అమెరికాలోని న్యూయార్క్‌లో పర్యటించిన కేజ్రీవాల్.. నగరంలోని రిచ్‌మండ్ హిల్స్‌ గురుద్వారా వేదికగా ఖలిస్థానీ నేతలతో సీక్రెట్‌గా భేటీ అయ్యారని కంప్లయింట్‌లో ప్రస్తావించారు. దీనికి సంబంధించిన ఫొటో ఆధారాలను గతంలో ఆమ్ ఆద్మీ పార్టీలో పనిచేసిన డాక్టర్ మునీష్ కుమార్ రైజాదా తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేయగా.. వైరల్ అవుతున్నాయి. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మార్చి 21న అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసింది. ఏప్రిల్ 1 నుంచి ఆయన ఢిల్లీలోని తిహార్ జైలులో ఉన్నారు. మే 25న ఢిల్లీలో పోలింగ్ జరగనుంది.

Next Story

Most Viewed