పిల్లల కళ్ళకు కాటుక రాస్తున్నారా.. నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి..

by Sumithra |
పిల్లల కళ్ళకు కాటుక రాస్తున్నారా.. నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి..
X

దిశ, ఫీచర్స్ : చిన్నపిల్లలు ముందే ముద్దుగా ఉంటారు. అలాంటి వారిని మరింత ముద్దొచ్చేలా వారి తల్లులు మరింత చక్కగా తయారు చేస్తారు. నల్లటి కాటుకతో బొట్లు పెట్టి అందంగా ముస్తాబు చేస్తారు. అలాగే తమ పిల్లలకి ఎలాంటి గాలి, చెడు దృష్టి తగలకుండా కాటుకతో దిష్టి చుక్కలు కూడా పెడతారు. ముఖ్యంగా భారతీయ ఇళ్లలో పిల్లలు పుట్టిన ఐదు లేదా ఆరవ రోజు నుంచే పిల్లలకు కాటుక పెట్టే సంప్రదాయాన్ని అనుసరిస్తారు. ఎన్నో ఏండ్లుగా ఈ సాంప్రదాయం అమలులో ఉంది. అలాగే చిన్న పిల్లల కళ్లకు కాటుక పెట్టడాన్ని తరచుగా చూస్తుంటాం. దీనివల్ల పిల్లలకు కళ్లు పెద్దవవుతాయని కూడా చాలా మంది అంటున్నారు. అయితే ఇది నిజంగా నిజమేనా ? పిల్లల కళ్లకు కాటుక పెట్టడం సురక్షితమేనా ? నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

చిన్న పిల్లల కళ్లకు కాటుక పెట్టడం ఎంతో ప్రయోజనాన్ని కలిగిస్తుందని భారతీయ ఇళ్లలో అమ్మమ్మలు, తల్లులు అంటూ ఉంటారు. బహుశా మీ చిన్నతనంలో కూడా మీ కళ్లకు కాటుక పెట్టి ఉండవచ్చు. ప్రస్తుతం దీని పై వైద్యులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి వారి అభిప్రాయాలని ఇప్పుడు తెలుసుకుందాం.

మన కళ్ల ఎగువ భాగంలో కన్నీళ్లను ఉత్పత్తి చేసే లాక్రిమల్ గ్రంధి ఉంటుంది. మనం రెప్పపాటు చేసినప్పుడు, కన్నీళ్లు కార్నియాలోకి వ్యాపించి, 'కన్నీటి నాళాలు' (కళ్ల ​​మూలల్లో ఉంటాయి) గుండా వెళతాయి. కన్నీళ్లు మన కళ్లను పొడిబారడం, ధూళి, దుమ్ము మొదలైన వాటి నుండి రక్షించడం ద్వారా వాటిని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. చైల్డ్ అండ్ పీడియాట్రిషియన్ డాక్టర్లు మాట్లాడుతూ కాటుకను పిల్లల కళ్లకు అప్లై చేయడం వల్ల కన్నీటి నాళానికి అడ్డుపడవచ్చని చెబుతున్నారు.

కంటి ఇన్ఫెక్షన్ భయం..

నిజానికి కాటుక చాలా స్మూత్ గా ఉంటుంది. దీని వల్ల కాటుక కళ్లకు పెట్టుకుంటే దుమ్ము, ధూళి అంటుకోవడం వల్ల కళ్లలో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

కాటుక కళ్ళను పెద్దదిగా చేస్తుందా..

ఓ పీడియాట్రిషియన్ సోషల్ మీడియాలో పిల్లల కోసం అనేక ఆరోగ్య చిట్కాలను పంచుకుంటూ ఉంటారు. కాటుకను కళ్లకు పెట్టడం వలన పిల్లలకు కళ్లు పెద్దవవుతున్నాయా లేదా అనే విషయం గురించి ఓ వీడియోలో చెప్పారు. కాజల్ రాసుకోవడం వల్ల పిల్లల కళ్లు పెద్దవి కావని, కళ్ల సైజు జన్యుపరమైనదే అంటున్నారు పీడియాట్రిషియన్.

ఈ విషయాలను గుర్తుంచుకోవాలి..

నవజాత శిశువుల కళ్ళు, చర్మం చాలా సున్నితంగా ఉంటాయి. కాబట్టి అప్పుడే పుట్టిన శిశువుకు కాజల్ పూయడం ముఖ్యంగా మానుకోవాలి. ఎందుకంటే ఇందులో ఉండే రసాయనాలు కంటి ఇన్ఫెక్షన్‌కు కారణమవుతాయి. అంతే కాకుండా, నవజాత శిశువు చర్మం పై ఎలాంటి అనవసరమైన సౌందర్య ఉత్పత్తులను పూయకూడని చెబుతున్నారు.

Next Story

Most Viewed