బెంగాల్ ఎన్నికల వేళ ‘ఈసీ’ బిగ్ ఆపరేషన్.. డీజీపీ, కోల్‌కతా సీపీ సహా కీలక అధికారుల బదిలీ!

by Malleboina Mahesh |

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక ఐపీఎస్ అధికారుల బదిలీ. కొత్త డీజీపీగా సిద్ధనాథ్ గుప్త, కోల్‌కతా సీపీగా అజయ్ కుమార్ నంద్ నియామకం.

బెంగాల్ ఎన్నికల వేళ ‘ఈసీ’ బిగ్ ఆపరేషన్..  డీజీపీ, కోల్‌కతా సీపీ సహా కీలక అధికారుల బదిలీ!
X

దిశ, వెబ్ డెస్క్: ఆదివారం సాయంత్రం ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో నిన్న సాయంత్రం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అలాగే గతంలో జరిగిన అల్లర్లు, గొడవలను దృష్టిలో ఉంచుకొని అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఇప్పటికే రాష్ట్ర సీఎస్ ను మార్చిన ఈసీ.. తాజాగా రాష్ట్ర డీజీపీ, కోల్ కతా సీపీ సహా పలువురు కీలక అధికారులను బదిలీ చేసింది.

అలాగే వారి స్థానంలో కొత్త వారికి భాద్యతలు ఇస్తు ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. ఎన్నికల సన్నద్ధత పై సమీక్ష నిర్వహించిన అనంతరం, పారదర్శకమైన, నిష్పక్షపాతమైన పోలింగ్ నిర్వహణ కోసం రాష్ట్రంలోని అత్యున్నత స్థాయి పోలీసు అధికారులను బదిలీ చేస్తూ సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం, 1992 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి సిద్ధనాథ్ గుప్తను పశ్చిమ బెంగాల్ ఇన్‌ఛార్జ్ డీజీపీగా (DG & IGP) నియమించింది.

అలాగే రాష్ట్ర రాజధాని కోల్‌కతా పోలీసు వ్యవస్థలో కూడా కమిషన్ కీలక మార్పులు చేసింది. 1996 బ్యాచ్‌కు చెందిన అజయ్ కుమార్ నంద్‌ను కోల్‌కతా నూతన పోలీస్ కమిషనర్‌గా నియమించగా, అజయ్ ముకుంద్ రనడేను రాష్ట్ర లా అండ్ ఆర్డర్ ఏడీజీ & ఐజీపీ గా నియమించింది. వీరితో పాటు నటరాజన్ రమేష్ బాబును కరెక్షనల్ సర్వీసెస్ డీజీగా బదిలీ చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎన్నికల విధుల్లో ఎటువంటి వివాదాలకు తావులేకుండా ఉండేందుకే ఈ కీలక పోస్టులలో అధికారులను మారుస్తూ కమిషన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ నియామకాలను తక్షణమే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఎన్నికల సంఘం ఆదేశించింది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన అధికారుల రిపోర్టును ఇవాళ మధ్యాహ్నం 3 గంటల లోపు తమకు పంపాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా, ప్రస్తుతం బదిలీ అయిన అధికారులకు ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎటువంటి ఎన్నికల సంబంధిత బాధ్యతలు అప్పగించకూడదని కఠిన నిబంధన విధించింది. ఈ హఠాత్తు బదిలీలు బెంగాల్ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి.

Next Story