BRS: ఏడు కేసులున్న సజ్జనార్‌ సిట్‌ అధికారిగా ఉండటం ఏంటి?

by Gantepaka Srikanth |   (  Updated:2026-01-23 15:21:31  IST  )

రేవంత్‌రెడ్డి రాజకీయ క్రీడలో పోలీస్ అధికారులు బలికావద్దని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సూచించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

BRS: ఏడు కేసులున్న సజ్జనార్‌ సిట్‌ అధికారిగా ఉండటం ఏంటి?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రేవంత్‌రెడ్డి రాజకీయ క్రీడలో పోలీస్ అధికారులు బలికావద్దని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సూచించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ భద్రత కోసం, రాష్ట్ర భద్రత కోసం ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నారు. ఒక పోలీస్ అధికారిగా ఫోన్ ట్యాపింగ్ విషయం తనకు తెలుసని.. అత్యంత గోప్యంగా ఉంచాల్సిన ఈ అంశాన్ని.. రేవంత్‌రెడ్డి బజారున పడేశారన్నారు. తెలంగాణ సంపదను పక్క రాష్ట్రాలకు రేవంత్ కట్టబెడుతున్నారని.. దీనిపై కేటీఆర్, హరీ‌శ్‌రావు వీరోచితంగా పోరాటం చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ సంపదను నైనీ కోల్డ్ బ్లాక్ దోచుకుంటున్నదని.. దీనిపై బీఆర్ఎస్ మాట్లాడితే డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ కూల్చివేసిందని.. దీన్ని డైవర్ట్ చేసేందుకు కమిషన్ వేశారని అన్నారు. ప్రమోషన్ల కోసం రేవంత్‌రెడ్డి వికృత క్రీడలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు గెస్ట్‌హౌస్‌లలో దోపిడీ చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులను వేధించేందుకు అక్రమ సిట్‌ను ఏర్పాటు చేశారన్నారు. సజ్జనార్ సిట్ అధికారిగా ఉన్నారని.. ఆయనపై ఏడు కేసులు ఉన్నాయని.. ఆయన సిట్ చీఫ్‌గా ఉండడం ఏందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును విచారించే నైతిక హక్కు సజ్జనార్, శివధర్‌రెడ్డికి లేదన్నారు.

సిట్‌ను శికండిలా వాడుతున్నారు: సబితా ఇంద్రారెడ్డి

పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయాన్ని ఓర్వలేకపోతున్నారని.. కాంగ్రెస్ ప్రభుత్వం సిట్‌ను శికండిలా వాడుతున్నదని మాజీమంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యే అన్నారు. ఎన్నికల ముందు బీఆర్ఎస్‌ను వేధించడానికి నక్కజిత్తుల రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. రాహుల్‌గాంధీ, సోనియాగాంధీకి నేషనల్ హెరాల్డ్ కేసులో నోటీసులు ఇస్తే వేధింపులు అంటారని.. మరి కేటీఆర్‌కు ఇచ్చింది వేధించడానికి కాదా? అని ప్రశ్నించారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో కేసులు, విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారన్నారు. ఎన్నిరకాల ఇబ్బందులు పెట్టినా ప్రజల పక్షాన ప్రశ్నిస్తామని హెచ్చరించారు.

మళ్లీ సమైక్యాంధ్ర పాలన తెచ్చారు: బాల్క సుమన్

అనేక హామీలు ఇచ్చి.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో ఒక్కటంటే ఒక్క హామీ నెరవేర్చలేక పోయిందన్నారు. నాటి రోజులు తెస్తామని, సమైక్య ఆంధ్ర పాలన తెచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్ అవినీతినీ బయట పెడుతుంటే, తమ నేతలకు రోజుకో నోటీస్ ఇస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేయాలని.. ఎన్నికలకు వెళ్లి ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందామని సవాల్ విసిరారు. కాంగ్రెస్ ఎన్ని డైవర్ట్ పాలిటిక్స్ చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.

కాంగ్రెస్‌ది పాపాల పాలన: మధుసూదనా చారి

కాంగ్రెస్ పాలన చూసి ప్రగల్భాల పాలన, పాపాల పాలన అని ప్రజలు చర్చించుకుంటున్నారని మండలి ప్రతిపక్ష నేత మధుసూదనా చారి అన్నారు. హరీశ్‌రావు, కేటీఆర్‌కు కక్ష పూరితంగా నోటీసులు ఇస్తున్నారన్నారు. తమ నాయకులపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ ఏనాడూ కక్ష సాధింపు చర్యలు చేయలేదన్నారు. కాంగ్రెస్ రెండేళ్లలో విచారణల పేరుతో పాలన సాగిస్తున్నారన్నారు. కాంగ్రెస్ దుర్మార్గాలను ప్రశ్నిస్తుంటే తట్టుకోలేక పోతున్నారని పేర్కొన్నారు. అసమర్థతకు సజీవ సాక్ష్యం రేవంత్‌రెడ్డి అని విమర్శించారు.

ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలేదు: తలసాని శ్రీనివాసయాదవ్

తన 35 ఏళ్ల జీవితంలో ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలేదని మాజీమంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. రాష్ట్రంలో విచిత్రమైన ప్రభుత్వం ఉన్నదని తెలిపారు. రేవంత్‌కు చిన్న వయస్సులో సీఎంగా అవకాశం వచ్చిందని.. ప్రజలకు మంచి చేయకుండా విచిత్ర పాలన నడిపిస్తున్నారని పేర్కొన్నారు. తుగ్లక్ రాజ్యంలో ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారని తెలిపారు. సీఎంకు, మంత్రులకు మధ్య సయోధ్య లేదని ఆరోపించారు. బొగ్గుకు సంబంధించిన ఆధారాలు హరీశ్‌రావు బయట పెట్టగానే సిట్ నోటీసులు ఇచ్చారని.. ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే ప్రభుత్వం దీర్ఘకాలికంగా ఉండదని హెచ్చరించారు. కేసీఆర్ సచివాలయం వెళ్లట్లేదు అన్నారని.. ఇప్పుడు మీరు వెళ్తున్నారా అని ప్రశ్నించారు. 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఇవ్వకుండా బీసీలను మోసం చేశారన్నారు. హిల్ట్ పాలసీతో దోపిడీకి శ్రీకారం చుట్టారన్నారు. తాము పారిపోయే వాళ్ళం కాదని.. ఏ విచారణకు అయినా సహకరిస్తామని వెల్లడించారు. దావోస్ పర్యటన పెట్టుబడులు చెబుతున్నారని.. కానీ అవి రావని అన్నారు.

Next Story