‘సైబర్ నేరగాళ్లకు బ్యాంకు అధికారుల అండ?’.. గ్రామస్తుల సంచలన ఆరోపణలు

by Jakkula.Mamatha |

సైబర్ నేరస్తులకు బ్యాంకు ఖాతాలు అప్పగించి జైలు పాలైన యువకుల సంఘటనలో బ్యాంకు అధికారుల పాత్ర కూడా ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

‘సైబర్ నేరగాళ్లకు బ్యాంకు అధికారుల అండ?’.. గ్రామస్తుల సంచలన ఆరోపణలు
X

దిశ ,లోకేశ్వరం: సైబర్ నేరస్తులకు బ్యాంకు ఖాతాలు అప్పగించి జైలు పాలైన యువకుల సంఘటనలో బ్యాంకు అధికారుల పాత్ర కూడా ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీరు అప్పగించిన ఖాతాల్లోకి దాదాపు రూ.8.18 కోట్లు సైబర్ నేరస్తులు మళ్లించినట్లు పోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిర్మల్ జిల్లాకు చెందిన ఐదుగురు యువకులు సైబర్ ముఠాలు ఇచ్చే కమిషన్ కు కక్కుర్తి పడి వివిధ బ్యాంకుల్లో కరెంట్ ఖాతాలు తెరిచి వారికి అప్పగించి కటకటాల పాలై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఆ యువకులు పెద్దగా లాభపడింది కూడా లేదని గ్రామస్తుల ద్వారా తెలిసింది.

కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయడం అంత సులభం కాదు..

వ్యాపార నిర్వహణ కోసం మాత్రమే కరెంట్ అకౌంట్లు ఓపెన్ చేయాల్సి ఉండగా గుడ్డిగా ఎలాంటి వ్యాపారాలు నిర్వహించని వారికి కరెంట్ అకౌంట్లు ఎలా ఓపెన్ చేస్తారని ఇందులో బ్యాంకు అధికారుల పాత్ర ప్రధానంగా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరెంట్ అకౌంట్ తెరవాలంటే అంత సులభం కాదని ట్రేడ్ లైసెన్స్‌తో పాటు జీఎస్టీ నంబర్, ఆధార్ కార్డు తదితర పత్రాలు జత చేసి దరఖాస్తు చేస్తే ఆ వ్యాపార సంస్థ నిర్వహించే స్థలం వద్దకు బ్యాంకు అధికారి వెళ్లి దాని ముందు నిలబడి లైవ్ లొకేషన్‌లో ఫోటో అప్లోడ్ చేసి పూర్తి వివరాలు నమోదు చేస్తేనే కరెంట్ అకౌంట్ తెరిచే ఆస్కారం ఉంది. కానీ ఎలాంటి వ్యాపారాలు లేనివారికి ఈ ఖాతాలు ఎలా తెరిచారని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ కేసులో బ్యాంకు సిబ్బందిని బాధ్యులు చేస్తే భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు జరగకుండా అడ్డుకట్ట పడే ఆస్కారం ఉందనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.

బ్యాంకు అధికారుల పాత్ర పై విచారణ చేపడతాం: లోకేశ్వరం ఎస్సై అశోక్

సైబర్ నేరస్తులకు బ్యాంకు ఖాతాలు అప్పగించిన యువకులు లోకేశ్వరం మండల కేంద్రంలో గల ఒక ప్రభుత్వ రంగ బ్యాంకుతో పాటు నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రైవేటు బ్యాంకుల్లో కరెంట్ ఖాతాలు తెరిచారు. ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు బ్యాంకు అధికారుల పాత్ర పై కూడా విచారణ చేపడుతున్నామని తెలిపారు. త్వరలో అందులో ప్రమేయం ఉన్న బ్యాంకు సిబ్బందిని సైతం అరెస్టు చేస్తామని ఎస్సై అశోక్ పేర్కొన్నారు.

Next Story