పాల్వంచలో నాటు బాంబుల తయారీ కలకలం..

by Batti.Sumithra |

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని శ్రీనివాస కాలనీలో ఉన్న శ్రీ వెంకటేశ్వర క్రాకర్స్ దుకాణంలో నాటు బాంబుల తయారీ జరుగుతోందన్న సమాచారం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

పాల్వంచలో నాటు బాంబుల తయారీ కలకలం..
X

దిశ, పాల్వంచ(టౌన్) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని శ్రీనివాస కాలనీలో ఉన్న శ్రీ వెంకటేశ్వర క్రాకర్స్ దుకాణంలో నాటు బాంబుల తయారీ జరుగుతోందన్న సమాచారం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. హోల్‌సేల్ బాణాసంచా విక్రయాలకు మాత్రమే అనుమతులు ఉన్న దుకాణంలో పేలుడు పదార్థాల తయారీ జరుగుతోందనే ఆరోపణలు రావడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. స్థానికుల కథనం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో బాణాసంచా తయారీకి కఠిన నిబంధనలు అమలులో ఉండగా, కేవలం వ్యాపారానికి మాత్రమే అనుమతి పొందిన దుకాణంలో నాటు బాంబుల తయారీ జరుగుతోందని ప్రచారం జరుగుతోంది. దీనిపై సంబంధిత శాఖలు వెంటనే సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

దుకాణానికి సంబంధించిన అనుమతులు నిబంధనల ప్రకారమే మంజూరయ్యాయా..? పేలుడు పదార్థాల తయారీకి ప్రత్యేక లైసెన్సులు ఉన్నాయా..? భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా..? అనే అంశాలపై అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ప్రజలు కోరుతున్నారు. అటవీ ప్రాంతానికి ఆనుకొని, జనావాసాల మధ్య ఇలాంటి కార్యకలాపాలు జరిగితే ఎలాంటి ప్రమాదం జరిగినా భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల ఈ వ్యవహారాన్ని అత్యంత ప్రాధాన్యంతో పరిగణించి అన్ని సంబంధిత శాఖలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాలని వారు కోరుతున్నారు.

వ్యాపారానికే అనుమతి.. తయారీకి కాదు..

ఈ అంశం పై పాల్వంచ పట్టణ ఎస్సై నాగరాజు స్పందిస్తూ, "శ్రీ వెంకటేశ్వర క్రాకర్స్‌కు కేవలం బాణాసంచా విక్రయాల నిర్వహణకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. అక్కడ ఎలాంటి క్రాకర్స్ తయారీకి లేదా పేలుడు పదార్థాల తయారీకి అనుమతులు లేవు. పోలీసులు ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ చేపడతారు. తనిఖీల్లో నాటు మందుగుండు సామగ్రి లేదా నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల తయారీ జరుగుతున్నట్లు తేలితే వెంటనే దుకాణాన్ని సీజ్ చేసి, నిర్వాహకులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం" అని స్పష్టం చేశారు.

అధికారుల చర్యల పై సర్వత్రా ఆసక్తి..

పోలీసుల ప్రకటనతో ఈ వ్యవహారం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. విచారణలో వాస్తవాలు వెలుగులోకి వచ్చిన తర్వాత సంబంధిత శాఖలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయనే దానిపై స్థానికంగా ఆసక్తి నెలకొంది. నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే బాధ్యులెవ్వరినీ ఉపేక్షించకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Next Story