ఫోన్ ట్యాపింగ్ కేసులో సెన్సేషన్.. మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు!

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-29 08:04:53  IST  )

తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది.

ఫోన్ ట్యాపింగ్ కేసులో సెన్సేషన్.. మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. విచారణలో భాగంగా చివరగా సీపీ సజ్జనార్ ఆధ్వర్యంలోని సిట్ బృందం బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వనున్నారు. తాజా సమాచారం ప్రకారం.. సిట్ అధికారులు కాసేపట్లో నగరంలోని నందీనగర్‌ నివాసానికి వెళ్లి కేసీఆర్‌కు 160 సీఆర్‌పీసీ కింద నోటీసులు అందజేయనున్నారు. రేపు ఫామ్‌హౌస్‌లోనే ఆయన్ని నేరుగా విచారించేందుకు అధికారులు ప్రత్యేకంగా ఓ క్వశ్చనేర్‌ను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది.

వాళ్లిచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా క్రాస్ ఎగ్జామినేషన్..

ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు, టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీసీ రాధాకిషన్ రావులను పలుమార్లు విచారించగా, తమ వాంగ్మూలంలో ‘పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఫోన్లు ట్యాపింగ్ చేశామని’ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఈ క్రమంలోనే సిట్ (SIT) అధికారులు ఆ ‘పైస్థాయి వ్యక్తి’ ఎవరనే కోణంలో విచారణను వేగవంతం చేశారు. ఇక ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, పారిశ్రామికవేత్తలు, మరియు జడ్జీల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చింది.. ఇంటెలిజెన్స్ విభాగం (SIB) నుంచి వచ్చిన సమాచారం ఎవరికి చేరింది? ఈ మొత్తం వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్ ప్రమేయం ఎంత వరకు ఉందనే విషయాలపై రేపు ఆయనను విచారించి స్టేట్‌మెంట్ రికార్డు చేయనున్నారు.

మున్సిపల్ ఎన్నికల వేళ పొలిటికల్ హీట్..

కాగా, ఇదే ఫోన్ ట్యాపింగ్ కేసులో జనవరి 20న మాజీ మంత్రి హరీశ్‌రావును జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సిట్ అధికారులు సుమారు 7 గంటల పాటు విచారించారు. అనంతరం జనవరి 23న కేటీఆర్‌ను, జనవరి 27న మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్‌ను విచారించిన విషయం తెలిసిందే. అయితే, రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన వేళ, మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. కాంగ్రెస్ సర్కార్ రాజకీయ కక్షతోనే తమ అగ్ర నేతలను ఇబ్బంది పెడుతోందని బీఆర్ఎస్ శ్రేణులు దుమ్మెత్తిపోస్తుండగా.. కాంగ్రెస్ మంత్రులు, ముఖ్య నేతలు మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోతుందని కౌంటర్ అటాక్ చేస్తున్నారు.

Similar News : KCRకు నోటీసులు ఇచ్చిన సిట్ అధికారులు.. ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కు బయలుదేరిన KTR, హరీశ్‌రావు

Next Story