- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు రెండో విడత చర్చలు.. పాక్ కు వెళ్తున్న అమెరికా, ఇరాన్!
పాకిస్తాన్ వేదికగా జరుగుతున్న అమెరికా-ఇరాన్ రెండో రౌండ్ చర్చలు అత్యంత ప్రాధాన్యతను సంతంతరించుకున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ మేఘాలను తొలగించి, శాంతిని పునరుద్ధరించే దిశగా పాకిస్తాన్ వేదికగా జరుగుతున్న అమెరికా-ఇరాన్ రెండో రౌండ్ చర్చలు అత్యంత ప్రాధాన్యతను సంతంతరించుకున్నాయి. నేడు ఇస్లామాబాద్‌లో ప్రారంభం కానున్న ఈ భేటీ కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్, ఆయన అల్లుడు జారెడ్ కుష్నర్ ఇప్పటికే అక్కడకు చేరుకున్నారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి నేతృత్వంలోని బృందం కూడా ఈ చర్చల్లో పాల్గొనబోతోంది. మొదటి రౌండ్ చర్చలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వనప్పటికీ, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ చేస్తున్న దౌత్య ప్రయత్నాల వల్ల ఈ రెండో రౌండ్ సాధ్యపడింది. రెండు వారాల పాటు ప్రకటించిన కాల్పుల విరమణ గడువు ముగుస్తున్న తరుణంలో, దానిని మరింత కాలం పొడిగించడమే ఈ చర్చల తక్షణ లక్ష్యమని తెలుస్తోంది.
కీలక అంశాలు ఇవే!
ఈ చర్చలలో ప్రధానంగా మూడు అంశాలు ఇరు దేశాల మధ్య చర్చకు రానున్నాయి. మొదటిది, అంతర్జాతీయ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిపై అమెరికా విధిస్తున్న ఆంక్షలు (Blockade), నిఘాను తొలగించాలని ఇరాన్ పట్టుబడుతోంది. ప్రతిగా, ఇరాన్ తన అణు కార్యక్రమానికి సంబంధించి యురేనియం సమృద్ధిని (Uranium Enrichment) నిలిపివేసి, అంతర్జాతీయ పరిమితులకు లోబడి ఉండాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. దీనితో పాటు, లెబనాన్ సరిహద్దుల్లో ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య జరుగుతున్న దాడులను అరికట్టడం కూడా ఈ చర్చల అజెండాలో భాగంగా ఉంది.
సఫలం అయ్యేనా!
ప్రస్తుతానికి ఇరాన్ తన పాత వైఖరిని కొంతవరకు పక్కన పెట్టి చర్చలకు సిద్ధమైనప్పటికీ, అమెరికా విధిస్తున్న కఠిన షరతులను ఆమోదిస్తుందా లేదా అన్నది సందేహంగానే ఉంది. ఏప్రిల్ ప్రారంభంలో జరిగిన మొదటి విడత చర్చలలో ఇరాన్ ప్రతినిధులు అమెరికా వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. అయితే, ఆర్థిక ఆంక్షల వల్ల ఇరాన్ ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రాంతీయ స్థిరత్వం దృష్ట్యా ఈసారి ఏదో ఒక మధ్యేమార్గం దొరుకుతుందని పాకిస్తాన్ దౌత్యవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఇస్లామాబాద్ చర్చలు సఫలమైతే, అద ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, ముడి చమురు మార్కెట్లకు పెద్ద ఊరటనిస్తుంది. లేదంట కాల్పుల విరమణ ముగిసిన తర్వాత యుద్ధం మళ్లీ తీవ్రరూపం దాల్చే ప్రమాదం పొంచి ఉంది.






