- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో ‘సీట్ల’ దందా
ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో బీ-కేటగిరీ సీట్ల దందా.. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి ముందే సీట్ల విక్రయం.. ఈసెట్ విద్యార్థులకు చుక్కెదురు!

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలు బీ కేటగిరి సీట్లతో దందా చేస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. సీట్ల రద్దు, బ్లాకింగ్ సమస్యలను చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కన్వీనర్, యాజమాన్య కోటా కౌన్సెలింగ్‌ను ఒకేసారి చేపట్టినా.. ప్రైవేటు యాజమాన్యాలు నిబంధనలను బేఖాతరు చేస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో ఇంజినీరింగ్ సీట్ల భర్తీకి ఈ ఏడాది నుండి కన్వీనర్, బీ కేటగిరీ సీట్లకు ఒకే సారి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. గతంలో కన్వీనర్ కోటా కింద కనీసం రెండు విడతల కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత బీ కరేటగిరీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చేవారు. తర్వాత తమకు టాప్ కాలేజీల్లో బీ కేటగిరీలో సీటు వచ్చిందని పేర్కొంటూ చాలా మంది వచ్చిన సీట్లు రద్దు చేసుకునేవారు.
దీనివల్ల అనేక సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో ఈ సంవత్సరం కౌన్సిలింగ్ తో పాటే బీ కేటగిరీ సీట్లు భర్తీ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అయితే కన్వీనర్ కోటా, మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీని ఒకేసారి చేపట్టాలని ప్రభుత్వం భావించినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ కొన్ని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు తమ పాత పద్ధతులనే కొనసాగిస్తూ సీట్ల దందాకు తెరలేపాయనే ఆరోపణలున్నాయి.
అప్పుడే ముగిసిన మేనేజ్‌మెంట్ సీట్ల భర్తీ
రాష్ట్రంలోని పలు ప్రముఖ ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలు అప్పుడే మేనేజ్‌మెంట్ కోటా సీట్లను లోపాయికారీగా భర్తీ చేసినట్లు తెలుస్తోంది. డిమాండ్ ఉన్న కంప్యూటర్ సైన్స్ (సీఎస్ఈ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డేటా సైన్స్ వంటి కోర్సుల్లో సీట్లను భారీ మొత్తంలో డొనేషన్లు వసూలు చేసి ముందే కేటాయించేసినట్లు సమాచారం. దీంతో నిబంధనల ప్రకారం సీట్లు పొందుదామనుకునే విద్యార్థులకు నిరాశే ఎదురవుతోంది. మేనేజ్మెంట్ సీట్ల భర్తీకి ఉన్నత విద్యా మండలి జూన్ 29 నుంచి జూలై 15 వరకు అడ్మిషన్ల షెడ్యూల్ ను ఖరారు చేసింది. కానీ ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు ఆయా కాలేజీల వెబ్ పోర్టల్స్ లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఫీజుల వివరాలు, బ్రాంచ్ వారీగా సీట్లు తదితర వివరాలు అధికారికంగా కనిపించడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.
లేటరల్ ఎంట్రీ.. కొన్ని కోర్సుల్లో సీట్లు నిల్
పాలిటెక్నిక్ పూర్తి చేసి నేరుగా ఇంజినీరింగ్ సెకండ్ ఇయర్‌లో చేరే లేటరల్ ఎంట్రీ (ఈసెట్) విద్యార్థులకు క్షేత్రస్థాయిలో చుక్కెదురవుతుంది. ప్రైవేటు కాలేజీలు మేనేజ్‌మెంట్ సీట్లను ముందే సర్దేయడంతో, కొన్ని కీలకమైన కోర్సుల్లో లేటరల్ ఎంట్రీకి అసలు సీట్లే మిగలడం లేదు. ముఖ్యంగా క్రేజ్ ఉన్న కోర్సుల్లో సెకండ్ ఇయర్‌లో జాయిన్ అవుదామనుకుంటున్న విద్యార్థులకు కాలేజీల్లో నో వేకెన్సీ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇటీవల కెమికల్ ఇంజినీరింగ్ సీటుకు సంబంధించి గత ఏడాది ఒక ప్రముఖ కాలేజీలో మిగిలిన సీట్లు.. ఈ ఏడాది ఖాళీ లేకపోవడం గమనార్హం. కోర్ బ్రాంచ్ కు విద్యార్థులు ఇంట్రెస్ట్ చూపడం వల్ల ఈ ఏడాది సీట్లు ఖాళీగా లేవని సమాధానమిస్తున్నారు. ఒకేసారి సీట్ల భర్తీ ప్రక్రియ వల్ల పారదర్శకత పెరుగుతుందని ఆశించినా.. యాజమాన్యాలు పాత పద్ధతుల్లోనే ముందే సీట్లు అమ్మేసుకోవడం వల్ల అర్హులైన విద్యార్థులకు సీట్లు దక్కకుండా పోతున్నాయని పేరెంట్స్ చెబుతున్నారు. ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.






