ముగిసిన రొనాల్డో ప్రపంచకప్ శకం.. కన్నీటి వీడ్కోలు పలికిన ఫుట్‌బాల్ దిగ్గజం

by Malleboina Mahesh |

ముగిసిన రొనాల్డో ప్రపంచకప్ కెరీర్.. స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర ఓటమి.. మైదానంలోనే వెక్కివెక్కి ఏడ్చిన ఫుట్‌బాల్ లెజెండ్!

ముగిసిన రొనాల్డో ప్రపంచకప్ శకం.. కన్నీటి వీడ్కోలు పలికిన ఫుట్‌బాల్ దిగ్గజం
X

దిశ, వెబ్ డెస్క్: ఫుట్‌బాల్ క్రీడలో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు సంపాదించుకున్న రోనాల్డో తన చివరి మ్యాచ్ ముందు సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. స్పెయిన్ తో జరిగిన మ్యాచ్ లో ఓటమి తర్వాత రోనాల్డో చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన, అద్భుతమైన ఒక సువర్ణ అధ్యాయం ముగిసింది. 2026 ఫిఫా ప్రపంచకప్ (FIFA World Cup 2026) టోర్నీలో పోర్చుగల్ స్టార్ ఆటగాడు, గ్లోబల్ ఐకాన్ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) ప్రయాణం కన్నీటితో ముగిసింది. డల్లాస్‌లోని AT&T స్టేడియంలో జరిగిన హోరాహోరీ ‘రౌండ్ ఆఫ్ 16’ (Round of 16) మ్యాచ్‌లో బలమైన స్పెయిన్ జట్టు 1-0 తేడాతో పోర్చుగల్‌పై విజయం సాధించి క్వార్టర్‌ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఈ ఓటమితో పోర్చుగల్ ప్రపంచకప్ రేసు నుండి నిష్క్రమించగా.. రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్‌కు అధికారికంగా తెరపడింది.

మైదానంలోనే వెక్కివెక్కి ఏడ్చిన రొనాల్డో..

ప్రస్తుతం 41 ఏళ్ల వయసున్న క్రిస్టియానో రొనాల్డోకు ఇదే చివరి ప్రపంచ కప్ మ్యాచ్ అని ప్రకటించాడు. తన సుదీర్ఘ కెరీర్‌లో దేశానికి ప్రపంచకప్ అందించాలనే కల నెరవేరకుండానే టోర్నీ ముగిసిపోవడంతో ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. మ్యాచ్ ముగిసిన వెంటనే స్టేడియంలోనే మోకాళ్లపై కూలబడి వెక్కివెక్కి ఏడ్చారు. ఇతర ప్లేయర్లు, ప్రత్యర్థి జట్టు సభ్యులు ఆయనను ఓదార్చే ప్రయత్నం చేసినా రొనాల్డో కన్నీళ్లు ఆగలేదు. రోనాల్డో కన్నీటితో మైదానాన్ని వీడుతున్న దృశ్యాలు చూసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ఫుట్‌బాల్ అభిమానుల గుండెలు బరువెక్కాయి. ప్రపంచకప్‌ గెలవలేకపోయినా.. ఐదు వేర్వేరు ప్రపంచకప్‌లలో గోల్స్ చేసిన ఏకైక ఆటగాడిగా, అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ చేసిన వీరుడిగా రొనాల్డో రికార్డు ఎప్పటికీ పదిలంగానే ఉంటుంది.

Next Story