సూపర్‌స్టార్లను దేవుళ్లను చేసి కొత్తవారిని ఇబ్బంది పెడుతున్నారు.. పార్వతి సంచలన కామెంట్స్

by Mallepaka Hamsa |

ఇండస్ట్రీలో ఇంకా వీరపూజ సంస్కృతి అలాగే కొనసాగుతోందని, ఇక్కడి సూపర్‌స్టార్లను దేవుళ్లలా పూజిస్తుంటారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

సూపర్‌స్టార్లను దేవుళ్లను చేసి కొత్తవారిని ఇబ్బంది పెడుతున్నారు.. పార్వతి సంచలన కామెంట్స్
X

దిశ, సినిమా: మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, పార్వతి తిరువోతు జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఐనోబడీ’. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను నిస్సాం బషీర్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో పృథ్వీరాజ్ రాజీవన్ అను బ్యాంగ్ ఉద్యోగి పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 10న తెలుగులో థియేటర్స్‌లోకి రావడానికి సిద్ధంగా ఉంది ఇక మలయాళంలో మాత్రం ఒకరోజు ముందుగానే అంటే జూలై 9న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో, సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న పార్వతి మలయాళ చిత్ర పరిశ్రమలోని ప్రస్తుత పరిస్థితులపై, హీరోల చుట్టూ ఉండే కల్చర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. గడిచిన ఎనిమిది, తొమ్మిదేళ్లలో మలయాళ సినీ పరిశ్రమలో కొన్ని మార్పులు వచ్చిన మాట నిజమేనని, కానీ ఆ మార్పులు మనస్ఫూర్తిగా వచ్చినవి కావని పార్వతి అభిప్రాయపడ్డారు. కేవలం ప్రజల నుంచి వచ్చిన విమర్శలు, మీడియా నిరంతరం చూపించిన శ్రద్ధ వల్లే ఇండస్ట్రీలో ఈ మార్పులు జరిగాయని చెప్పారు.

ఇండస్ట్రీలో ఇంకా వీరపూజ సంస్కృతి అలాగే కొనసాగుతోందని, ఇక్కడి సూపర్‌స్టార్లను దేవుళ్లలా పూజిస్తుంటారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల వారి తప్పులను ప్రశ్నించడం ఎవరికైనా చాలా కష్టంగా మారుతుందని పేర్కొన్నారు. ఇలాంటి వాతావరణం ఉండటం వల్లే ఇండస్ట్రీలో బాగా పలుకుబడి ఉన్న వ్యక్తులు, కొత్తగా వచ్చే వారిపై తమ అధికారాన్ని చాలా సులభంగా చెలాయిస్తున్నారని వారి టాలెంట్‌ను తొక్కేస్తున్నారని ఇబ్బంది పెడుతున్నారని పార్వతి అన్నారు. సినిమా రంగంలో మార్పులు చాలా నెమ్మదిగా సాగుతుండటం తనకు ఎంతో నిరాశ కలిగిస్తోందని, అయినప్పటికీ తమ మహిళా సంక్షేమ సంఘం మహిళల హక్కుల కోసం, ఇండస్ట్రీలో మంచి వాతావరణం కోసం ఈ పోరాటాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఆపదని ఆమె స్పష్టం చేశారు. పార్వతి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

Next Story