చుక్కాపూర్ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మందిర్‌లో గుర్తుతెలియని అనాథ వ్యక్తి మృతి

by Kodari Anjali |

చుక్కాపూర్ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మందిర్‌లో గుర్తుతెలియని అనాథ వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు.

చుక్కాపూర్ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మందిర్‌లో గుర్తుతెలియని అనాథ వ్యక్తి మృతి
X

దిశ, తలకొండపల్లి: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చుక్కాపూర్ గ్రామంలోని ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మందిర్ (ప్రభుత్వ ఆసుపత్రి) ఆవరణలో గుర్తుతెలియని అనాథ వ్యక్తి మృతిచెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. మంగళవారం ఉదయం ఆసుపత్రి సమీపంలో నివసించే స్థానికులు ఆసుపత్రి వరండాలో వ్యక్తి అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించి పరిశీలించగా, అప్పటికే మృతిచెందినట్లు గుర్తించారు. వెంటనే తలకొండపల్లి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న తలకొండపల్లి ఎస్హెచ్ఓ వి. జానకిరామ్ రెడ్డి,ఏఎస్‌ఐ విష్ణువర్ధన్ రెడ్డి తమ పోలీసు సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుని వయసు సుమారు 45 నుండి 50 సంవత్సరాలు లోపు ఉంటాడని తెలుస్తుంది.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక విచారణలో మృతుడు సుమారు రెండు రోజుల క్రితమే, అంటే ఆదివారం రాత్రి మృతి చెంది ఉండవచ్చని తలకొండపల్లి సీఐ జానకిరామ్ రెడ్డి అనుమానాలు వ్యక్తం చేశారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం మృతికి గల ఖచ్చితమైన కారణాలు, సమయం వెల్లడయ్యే అవకాశం ఉందని తెలిపారు.

కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం పోలీసుల గాలింపు

స్థానికుల కథనం ప్రకారం, మృతుడు గత ఐదు రోజులుగా గ్రామంలో సంచరిస్తూ, ఎవరైనా చిన్నచిన్న పనులు అప్పగిస్తే వాటిని చేస్తూ జీవనం సాగించేవాడని, హిందీలో బాగా మాట్లాడుతూ.. కొద్ది కొద్దిగా తెలుగులో మాట్లాడేవాడని పేర్కొంటున్నారు. తన పేరు మారుతి అని, తాను డెకరేషన్ జిల్లా నుంచి వచ్చానని, కొందరు గిరిజనులు ఇక్కడికి తీసుకొచ్చి వదిలివెళ్లారని చెప్పినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. అలాగే తన భార్య పేరు జ్యోతి అని, తమకు ఐదుగురు కుమార్తెలు ఉన్నారని, వారిలో ముగ్గురికి వివాహాలు జరిగాయని, మరో ఇద్దరి వివాహాలు చేయాల్సి ఉందని చెప్పినట్లు సూచిస్తున్నారు. మృతుడి వద్ద ఒక బ్యాగ్, దుస్తులు లభించగా, వాటిని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించినప్పటికీ ఎలాంటి గుర్తింపు ఆధారాలు లభించలేదు. దీంతో మృతుడి పూర్తి వివరాలు, స్వగ్రామం, కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం పోలీసులు మరిన్ని వివరాలు సేకరిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అనాధ వ్యక్తి ఆచూకీ లభించే వరకు శవాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రపరచనునట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించే ప్రక్రియలో స్థానిక గ్రామపంచాయతీ సర్పంచ్ మాకం వీరేశలింగం, గ్రామపంచాయతీ సిబ్బంది సహకరించారు. ఘటన విషయం తెలుసుకున్న వెంటనే స్థానిక సర్పంచ్ మాకం. వీరేశ లింగం, వార్డు సభ్యులు రాకేష్, లవణ్య చంద్రకుమార్, మల్లేశ్, బాలమణి, శ్రీకాంత్‌తో పాటు గ్రామస్తులు తదితరులు సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులకు సహకరించారు.

Next Story