E20 తర్వాత E21, E25 పెట్రోల్ వైపు కేంద్రం అడుగులు..?

by Malleboina Mahesh |

భారత్‌లో త్వరలో E21, E25 పెట్రోల్ ప్రయోగం.. 2029 నాటికి 25% ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యం.. రూ.1.5 లక్షల కోట్ల విదేశీ మారకం ఆదా!

E20 తర్వాత E21, E25 పెట్రోల్ వైపు కేంద్రం అడుగులు..?
X

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ ఆసియాలో ఇటీవల నెలకొన్న యుద్ధ పరిస్థితులు, ఇంధన సంక్షోభం తర్వాత భారత ప్రభుత్వం ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది. ఈ మేరకు భారత్ లో ఇప్పటికే ఈ20 పెట్రోల్ అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా దేశీయ ఇంధన విధానంలో కేంద్ర ప్రభుత్వం మరో విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 20 శాతం ఇథనాల్ కలిపిన ‘E20’ పెట్రోల్‌ను విజయవంతంగా అందుబాటులోకి తెచ్చిన కేంద్రం.. ఇప్పుడు తదుపరి దశగా E21- E25 పెట్రోల్ అమలుపై దృష్టి సారించినట్లు వార్తలు వస్తున్నాయి. కొత్త ప్రణాళికల ప్రకారం, 2027 నాటికి 21 శాతం ఇథనాల్ మిశ్రమంతో కూడిన E21 పెట్రోల్‌ను, అలాగే 2029 నాటికి 25 శాతం ఇథనాల్ మిశ్రమంతో కూడిన E25 పెట్రోల్‌ను దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ నిర్ణయం ద్వారా ముడి చమురు దిగుమతులను భారీగా తగ్గించి, దేశ ఇంధన భద్రతను మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది.

ఐదేళ్ల ముందే E20 లక్ష్యం పూర్తి..

నిజానికి దేశంలో 2030 నాటికి E20 పెట్రోల్‌ను పూర్తిగా అమలు చేయాలని తొలుత భావించినా.. ప్రభుత్వం ఐదేళ్ల ముందే ఆ మైలురాయిని అధిగమించింది. అయితే, ప్రస్తుతం వాడుకలో ఉన్న E20 పెట్రోల్ వల్ల పాత వాహనాలలో మైలేజ్ తగ్గడం, విడిభాగాలు దెబ్బతినడం వంటి సమస్యలొస్తున్నాయని సామాజిక మాధ్యమాలలో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని, పరిశ్రమలపై లేదా వినియోగదారులపై ఆకస్మిక భారం పడకుండా ఉండటానికి.. కొత్త ఇంజిన్లు, సరఫరా వ్యవస్థలను అభివృద్ధి చేసుకునేలా ఆటోమొబైల్ కంపెనీలకు (బజాజ్, టయోటా, టీవీఎస్ వంటి సంస్థలకు) తగిన సమయం ఇస్తూ ఈ మార్పును దశలవారీగా అమలు చేయనున్నారు. ఈ ఇథనాల్ బ్లెండింగ్ ప్రక్రియ వల్ల ఏటా సుమారు 45 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు దిగుమతులు తగ్గడంతో పాటు దాదాపు రూ.1.5 లక్షల కోట్ల విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుందని కేంద్రం అంచనా వేస్తోంది.

Next Story