- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముంబై వీధుల్లో ‘స్పైడర్ మ్యాన్’.. వరదల్లో ప్రజలకు అండగా కంటెంట్ క్రియేటర్
మహారాష్ట్ర రాజధాని ముంబై మహానగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్న వేళ, భివాండి ప్రాంతంలో ఒక ఆసక్తికరమైన, హృదయాలను హత్తుకునే దృశ్యం నెట్టింట వైరల్‌గా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: మహారాష్ట్ర రాజధాని ముంబై మహానగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్న వేళ, భివాండి ప్రాంతంలో ఒక ఆసక్తికరమైన, హృదయాలను హత్తుకునే దృశ్యం నెట్టింట వైరల్‌గా మారింది. రోడ్లన్నీ జలమయమై, గుంతలు ఎక్కడున్నాయో తెలియక వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో.. ఒక యువకుడు ‘స్పైడర్ మ్యాన్’ అవతారంలో రంగంలోకి దిగాడు. వరద నీటిలో చిక్కుకున్న వారికి సాయం చేస్తూ రియల్ లైఫ్ హీరో అనిపించుకుంటున్నాడు.
ఎవరీ స్పైడర్ మ్యాన్?
ఈ స్పైడర్ మ్యాన్ వెనుక ఉన్నది భివాండికి చెందిన షాదాబ్ మోమిన్ అనే కంటెంట్ క్రియేటర్. సాధారణంగా సూపర్ హీరో గెటప్‌లలో కామెడీ వీడియోలు చేసే షాదాబ్, ఈ విపత్కర పరిస్థితుల్లో తన పంథాను మార్చుకున్నాడు. కేవలం నెటిజన్లకు వినోదం పంచడమే కాకుండా, ప్రజలకు సామాజిక సేవ చేయాలనే ఉద్దేశంతో భివాండిలోని వంజార్ పట్టీ నాకా ప్రాంతంలో వరద నీటిలోకి దిగాడు.
ఆపద్బాంధవుడిగా ఇలా..
వర్షపు నీటితో నిండిన రోడ్లపై ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియక వాహనదారులు ప్రమాదాల బారిన పడుతుంటారు. దీనిని గమనించిన షాదాబ్, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తూ వాహనాలకు సురక్షితమైన దారిని చూపిస్తున్నాడు. వరద నీటిలో రోడ్డు దాటలేక ఇబ్బంది పడుతున్న చిన్నపిల్లలను తన భుజాలపై ఎక్కించుకుని సురక్షితంగా అవతలి వైపుకు చేరుస్తున్నాడు. ప్రజలకు సాయం చేస్తూనే వారి ముఖాల్లో నవ్వులు పూయించేందుకు షాదాబ్ తనదైన శైలిలో ఫన్నీ పనులు కూడా చేస్తున్నాడు. సూపర్ హీరో తరహాలో యాక్షన్లు చేయడం, రోడ్డుపై నిలిచిన వరద నీటిని ఒక చిన్న గ్లాసుతో తోడిపోయడానికి ప్రయత్నించడం వంటివి చేసి అందరినీ నవ్విస్తున్నాడు. దీనికి తోడు, ఒకచోట ఇద్దరు వ్యక్తులు ఈ స్పైడర్ మ్యాన్‌నే ఎత్తుకుని మోసుకెళ్లడం వీడియోలో మరింత నవ్వులు పూయిస్తోంది. ప్రస్తుతం ఈ దేశీ ‘స్పైడర్ మ్యాన్’ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఆపద సమయంలో ప్రజలకు అండగా నిలుస్తూ, కష్టాల్లో ఉన్నవారి పెదవులపై చిరునవ్వులు చిందిస్తున్న షాదాబ్ మోమిన్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.






