SIR: బీఎల్ఓలను MIM, కాంగ్రెస్ బెదిరిస్తోంది.. సీఈవోకు బీజేపీ ఫిర్యాదు

by Prasad Jukanti |

తెలంగాణలో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చూడాలని బీజేపీ నేతలు ఇవాళ తెలంగాణ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

SIR: బీఎల్ఓలను MIM, కాంగ్రెస్ బెదిరిస్తోంది.. సీఈవోకు బీజేపీ ఫిర్యాదు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR 2026) ప్రక్రియలో పలు అక్రమాలు జరుగుతున్నాయని, కాంగ్రెస్, ఎంఐఎం కలిసి బీఎల్ఓలను బెదిరిస్తున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు అరోపించారు. ఈ మేరకు ఇవాళ తెలంగాణ బీజేపీ నేతల బృందం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (CEO)ని కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వరుస ప్రభుత్వాలు ఏఐఎంఐఎం (AIMIM) పార్టీకి మితిమీరిన ప్రాధాన్యత ఇస్తున్నాయని లేఖలో బీజేపీ ఆరోపించింది. క్షేత్రస్థాయిలో అందుతున్న సమాచారం ప్రకారం 'SIR 2026' ప్రక్రియ సజావుగా సాగడం లేదని తక్షణమే ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

MIM నేతలకు ఈసీఐ యాప్ యాక్సెస్:

సీఈవోను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన రామచందర్ రావు.. హైదరాబాద్ పాతబస్తీలో బూత్ లెవల్ అధికారులు (BLOs) ఇళ్ల వద్దకు వెళ్లి 'ఎన్యూమరేషన్ ఫారాలు' పంపిణీ చేయడం లేదని రామచందర్ రావు ఆరోపించారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లామన్నారు. బీఎల్వోలు ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయకుండా అడ్డుకోవడమే కాకుండా దానికి బదులుగా ఎంఐఎం నాయకులు ఏర్పాటు చేసిన క్యాంపులకు వెళ్లి అక్కడ బల్క్‌గా ఫారాలను పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. నింపిన ఫారాలను అప్‌లోడ్ చేయడానికి వీలుగా ఎన్నికల సంఘం (ECI) యాప్ యాక్సెస్‌ను కూడా ఎంఐఎం నేతలకు ఇస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.

ఒకే కుటుంబం.. వేర్వేరు పోలింగ్ బూత్‌లు:

జీహెచ్‌ఎంసీ (GHMC), సైబరాబాద్, మల్కాజ్‌గిరి, వరంగల్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో చాలా మంది ఓటర్లకు ఇంకా ఎన్యూమరేషన్ ఫారాలు అందలేదని వివరించింది. ఒకే కుటుంబానికి చెందిన ఓటర్ల పేర్లు వేర్వేరు పోలింగ్ బూత్‌లలో ఉండటంతో ఇళ్లను గుర్తించడం బీఎల్ఓలకు కష్టంగా మారింది. ఓటర్లు ఇంట్లో లేకపోతే కనీసం 3 సార్లు బీఎల్ఓలు వారి ఇంటికి వెళ్లడాన్ని తప్పనిసరి చేయాలని కోరినట్లు తెలిపారు.

భాషా సమస్యలు:

ఉపాధి, విద్య, వ్యాపారాల కోసం ఇతర రాష్ట్రాల నుండి వచ్చి తెలంగాణలో స్థిరపడిన వారు తెలుగు చదవడం, రాయడం లేక ఇబ్బంది పడుతున్నారని.. కాబట్టి హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోనూ ఇంగ్లీష్, తెలుగు రెండు భాషల్లో ఫారాలను అందుబాటులో ఉంచాలని సీఈవోనుకోరినట్లు తెలిపారు. సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించి తెలంగాణలో 'SIR 2026' ప్రక్రియను పారదర్శకంగా కోరారు.

Next Story