కేరళను వణికించిన వయనాడ్ విపత్తు.. టన్నెల్ రోడ్ ప్రాజెక్ట్ సైట్‌పై విరిగిపడ్డ కొండచరియలు!

by Malleboina Mahesh |

కేరళలోని వయనాడ్ టన్నెల్ ప్రాజెక్ట్ సైట్ వద్ద భారీగా విరిగిపడ్డ కొండచరియలు.. శిథిలాల కింద 30 మందికి పైగా కార్మికులు చిక్కుకున్నట్లు ఆందోళన!

కేరళను వణికించిన వయనాడ్ విపత్తు.. టన్నెల్ రోడ్ ప్రాజెక్ట్ సైట్‌పై విరిగిపడ్డ కొండచరియలు!
X

దిశ, వెబ్ డెస్క్: గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మంగళవారం (జూలై 7, 2026) మధ్యాహ్నం కేరళలోని వయనాడ్‌లో భారీ విపత్తు సంభవించింది. మేప్పాడి సమీపంలోని కల్లాడి వద్ద ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడటంతో, వయనాడ్ - మలప్పురం జిల్లాలను కలుపుతూ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అనాక్కాంపొయిల్-మేప్పాడి ‘టన్నెల్ రోడ్ ప్రాజెక్ట్’ సైట్ పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో నిర్మాణ సంస్థకు చెందిన కార్యాలయ కంటైనర్లు, కార్మికుల బస్సులు, కార్లు, జేసీబీలు వంటి భారీ యంత్రాలు పూర్తిగా మట్టి దిబ్బల కింద సమాధి అయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో పనుల్లో ఉన్న సుమారు 30 నుంచి 50 మంది వరకు కార్మికులు మట్టి శిథిలాల కింద చిక్కుకుని ఉండవచ్చని రెస్క్యూ అధికారులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. స్థానికులు తక్షణమే స్పందించి ముగ్గురు కార్మికులను ప్రాణాలతో కాపాడగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడటంతో వారిని హారిసన్ మలయాళం ఎస్టేట్ ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘోర ప్రమాదం పై కేరళ ముఖ్యమంత్రి వీడీ సతీశన్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించగా.. రాష్ట్ర మంత్రులు ఈ సమాచారం అందిన వెంటనే కల్పెట్టా ఫైర్ సర్వీసెస్, కల్పితార్ రాపిడ్ రెస్పాన్స్ టీమ్‌తో పాటు కోజికోడ్ నుండి ఎన్‌డీఆర్‌ఎఫ్ (NDRF) బృందాలు రంగంలోకి దిగి యుద్ధప్రాతిపదికన రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. అయితే, భారీ వృక్షాలు కూలిపోవడం, మీనాక్షి బ్రిడ్జ్ సమీపంలోని చిన్న నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఈ ప్రాంతంలో కొన్ని ఇళ్లతో పాటు హోమ్‌స్టేలు కూడా ఉండటంతో, వర్షాల సీజన్ కారణంగా ఎవరైనా పర్యాటకులు కూడా మట్టి శిథిలాల కింద చిక్కుకున్నారా అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు.

Next Story