ప్రధాని మోడీకి ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారం

by Ramesh Naini |   (  Updated:2026-07-07 06:11:29  IST  )

భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఇండోనేషియా ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘బింటాంగ్‌ ఆదిపూర్ణ రిపబ్లిక్‌ ఆఫ్‌ ఇండోనేసియా’ను ప్రకటించింది.

ప్రధాని మోడీకి  ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారం
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఇండోనేషియా ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘బింటాంగ్‌ ఆదిపూర్ణ రిపబ్లిక్‌ ఆఫ్‌ ఇండోనేసియా’ను ప్రకటించింది. ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఈ ప్రతిష్టాత్మక అవార్డును మోడీకి అందజేశారు. ఈ పురస్కారం భారత ప్రజలందరికీ లభించిన గౌరవంగా ప్రధాని అభివర్ణించారు. ఇండోనేసియా దేశ సార్వభౌమత్వానికి, అభ్యున్నతికి విశేష సేవలు అందించిన వారికి 1959 నుంచి ఈ అత్యున్నత గౌరవాన్ని అందజేస్తున్నారు. అంతకుముందు, జాకార్తాలోని అధ్యక్ష భవనం ‘ఇస్తానా మెర్డెకా’కు చేరుకున్న ప్రధాని మోడీకి ఘన సైనిక వందనంతో అధికారిక స్వాగతం లభించింది. ఈ పర్యటన భారత్-ఇండోనేసియా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని భారత విదేశాంగ శాఖ (MEA) స్పష్టం చేసింది.

రక్షణ, ఆర్థిక రంగాల్లో కీలక మైలురాళ్లు..

ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధాన్ని బలోపేతం చేసే పలు కీలక నిర్ణయాలు జరిగాయి. భారతదేశ విజయవంతమైన ఎయిర్-టు-ఎయిర్ క్షిపణి ‘అస్త్ర’ (Astra)ను దిగుమతి చేసుకోవడానికి ఇండోనేసియా నిర్ణయించింది. అలాగే, బ్రహ్మోస్ క్షిపణి సామర్థ్యాన్ని మరింత విస్తరించేందుకు భారత్ అదనపు బ్యాటరీల సాయం అందించనుంది. భారతదేశ ఎన్నికల నిర్వహణ నమూనాను ప్రశంసించిన ఇండోనేసియా.. తమ దేశం కోసం ప్రత్యేకంగా ఈవీఎంల (EVMs) అభివృద్ధికి భారత మద్దతును కోరింది. మలక్కా జలసంధికి ఆనుకుని, భారత్‌కు చెందిన గ్రేట్ నికోబార్ ప్రాజెక్టుకు కేవలం 100 మైళ్ల దూరంలో ఉన్న వ్యూహాత్మక ‘సబాంగ్ ఓడరేవు’ (Sabang port)ను ఇరు దేశాలు సంయుక్తంగా అభివృద్ధి చేయనున్నట్లు అధికార వర్గాల సమాచారం.

పురస్కారం విశిష్టత ఏంటి..?

‘బింటాంగ్ ఆదిపూర్ణ’ అనేది రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియాలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, సర్వోన్నతమైన గౌరవ పతకం. ఇండోనేషియా దేశపు ఐక్యత, సమగ్రత, నిరంతర అభివృద్ధి మరియు శ్రేయస్సు కోసం అంతర్జాతీయంగా అసాధారణమైన రీతిలో కృషి చేసిన ప్రముఖులకు మాత్రమే ఈ అత్యున్నత అవార్డును బహూకరిస్తారు. భారత్–ఇండోనేషియా వ్యూహాత్మక బంధాన్ని నూతన శిఖరాలకు చేర్చడంలో ప్రధాని మోదీ చూపిన చొరవకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేస్తున్నట్లు ఇండోనేషియా ప్రభుత్వం తెలిపింది. గడిచిన కొన్నేళ్లలో ప్రధాని మోదీ పలు అంతర్జాతీయ దేశాల నుండి పొందిన అత్యున్నత పౌర పురస్కారాల జాబితాలో ఈ మెడల్ కూడా చేరింది.

Next Story