ఏపీలో LG ఎలక్ట్రానిక్స్ జీసీసీ ఏర్పాటు చేయండి.. దక్షిణ కొరియా పర్యటనలో మంత్రి లోకేశ్‌ కీలక భేటీలు

by Ramesh Naini |

పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా దక్షిణ కొరియాలో రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌ పర్యటన మూడో రోజు చురుగ్గా కొనసాగింది.

ఏపీలో LG ఎలక్ట్రానిక్స్ జీసీసీ ఏర్పాటు చేయండి.. దక్షిణ కొరియా పర్యటనలో మంత్రి లోకేశ్‌ కీలక భేటీలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా దక్షిణ కొరియాలో రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌ పర్యటన మూడో రోజు చురుగ్గా కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన పలు దిగ్గజ సంస్థల ప్రతినిధులతో కీలక భేటీలు నిర్వహించారు.

అపాక్ట్ (APACT) సీఈవోతో సమావేశం

అపాక్ట్ సీఈవో సియాంగ్ డాంగ్ లీతో మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు. ఓఎస్‌ఏటీ (OSAT) సెమీకండక్టర్ రంగంలో నైపుణ్యాభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. ఏఎస్‌ఐపీ భాగస్వామ్యంతో ఏపీలో అపాక్ట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులోనూ వారితో దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.

విశాఖలో ‘జీసీసీ’ ఏర్పాటు చేయండి

అనంతరం LG ఎలక్ట్రానిక్స్ గ్లోబల్ సీఈవో ల్యూ జె చెయోల్, ఇండియా సీఈవో హాంగ్ జు జియోన్​లతో లోకేశ్ విడివిడిగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పలు ప్రతిపాదనలు చేశారు. నోయిడా, బెంగళూరుల తరహాలో విశాఖపట్నంలో ఒక ఇంజనీరింగ్ సెంటర్/జీసీసీ (GCC) ఏర్పాటు చేయాలి. శ్రీసిటీ పరిసరాల్లో డిస్‌ప్లే మాడ్యూల్స్, సెన్సార్లు, పవర్ ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీ కేంద్రంతో పాటు చిల్లర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని నెలకొల్పాలి. ఐఓటీ (IoT), రోబోటిక్స్ రంగాల్లో ఇన్నోవేషన్ ల్యాబ్‌ల అభివృద్ధికి కలిసి పనిచేయాలి.

శ్రీసిటీలో రూ.5,000 కోట్లతో మూడో ప్లాంట్: LG CEO

మంత్రి లోకేశ్ విజ్ఞప్తుల పట్ల ఎల్జీ ఇండియా సీఈవో హాంగ్ జు జియోన్ సానుకూలంగా స్పందించారు. ఏపీలోని శ్రీసిటీలో రూ. 5,000 కోట్ల భారీ వ్యయంతో తాము మూడో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. దీని ద్వారా సుమారు 1,500 మందికి ఉపాధి లభిస్తుందని, ఈ ఏడాది చివరినాటికి ఇక్కడ వాణిజ్య ఉత్పత్తి ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేశారు.

Next Story