- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత.. గేట్లు బద్దలుకొట్టి లోపలికి దూసుకెళ్లిన కార్మికులు
ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. భారీ జరిమానాలకు వ్యతిరేకంగా గేట్లు బద్దలుకొట్టి లోపలికి దూసుకెళ్లిన కార్మికులు!

దిశ, వెబ్ డెస్క్: నగరంలోని ఖైరతాబాద్ ప్రాంతంలో ఉన్న ప్రాంతీయ రవాణా కార్యాలయం (RTO Office) వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీఏ (RTA) అధికారులు విధిస్తున్న భారీ జరిమానాలకు, వేధింపులకు వ్యతిరేకంగా వాహనదారులు, రవాణా రంగ కార్మికులు, కార్మిక సంఘాల నేతలు ఒక్కసారిగా ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయాన్ని ముట్టడించారు. పెద్ద సంఖ్యలో నిరసన ర్యాలీగా తరలివచ్చిన కార్మికులు, ఆర్టీవో కార్యాలయం ప్రధాన గేట్లను బద్దలు కొట్టుకుని లోపలికి దూసుకెళ్లారు. కార్యాలయ ఆవరణను ముట్టడించి ఆర్టీవో, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నిరసనకారులను అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య నెట్టివేతలు, వాగ్వాదం జరిగి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
రూ. 15,000 నుండి 25,000 జరిమానాలపై ఆగ్రహం..
తమ వాహనాలకు చిన్న చిన్న కారణాలు చూపిస్తూ రూ. 15,000ల నుంచి ఏకంగా రూ. 25,000ల వరకు భారీ జరిమానాలు (Heavy Fines) విధిస్తున్నారని కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజువారీ సంపాదనతో జీవించే తాము ఇంత భారీ మొత్తంలో పెనాల్టీలు ఎలా కట్టగలమని ప్రశ్నించారు. ట్రాఫిక్, ఆర్టీఏ అధికారులు తనిఖీల పేరుతో చేస్తున్న వేధింపులను తక్షణమే ఆపాలని, జరిమానాల మొత్తాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ ముట్టడి కారణంగా ఖైరతాబాద్ ప్రధాన రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయి తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.






