కర్మన్‌ఘాట్ చౌరస్తాలో ట్రాఫిక్ గందరగోళం.. అధికారుల నిర్లక్ష్యమే కారణమా?

by Kodari Anjali |

ఎల్ బి నగర్ నియోజక వర్గం కర్మన్‌ఘాట్ చౌరస్తా రోజురోజుకూ ట్రాఫిక్ సమస్యలకు కేంద్రబిందువుగా మారుతోంది.

కర్మన్‌ఘాట్ చౌరస్తాలో ట్రాఫిక్ గందరగోళం.. అధికారుల నిర్లక్ష్యమే కారణమా?
X

దిశ, చంపాపేట్: ఎల్ బి నగర్ నియోజక వర్గం కర్మన్‌ఘాట్ చౌరస్తా రోజురోజుకూ ట్రాఫిక్ సమస్యలకు కేంద్రబిందువుగా మారుతోంది. హోటళ్లు, వైన్స్ దుకాణాల ముందు అదుపు లేకుండా వాహనాలను రహదారిపైనే నిలిపివేయడం, ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు పెరగడం, ట్రాఫిక్ నిర్వహణలో సమర్థవంతమైన చర్యలు లేకపోవడంతో ప్రతిరోజూ వేలాది మంది వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం, సాయంత్రం రద్దీ సమయాల్లో పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. హోటళ్లకు వచ్చే వినియోగదారులు తమ కార్లు, బైక్‌లను ప్రధాన రహదారిపైనే నిలిపివేయడం, వైన్స్ దుకాణాల వద్ద వాహనాలు గుంపులుగా నిలవడం, ఆటోలు కూడా ఇష్టానుసారంగా ఆగిపోవడంతో చౌరస్తా మొత్తం ట్రాఫిక్ జామ్‌గా మారుతోంది. కొద్దిపాటి దూరం ప్రయాణించేందుకు కూడా వాహనదారులు ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తోందని స్థానికులు చెబుతున్నారు. ఇక ఫుట్‌పాత్‌లు ఆక్రమణలకు గురికావడంతో పాదచారుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, వృద్ధులు ఫుట్‌పాత్‌పై నడిచే అవకాశం లేక రహదారిపైనే ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో ప్రమాదాల ముప్పు రోజురోజుకూ పెరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్

స్థానికుల అభిప్రాయం ప్రకారం, ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్ తనిఖీలు, ఇతర ట్రాఫిక్ ఉల్లంఘనలపై చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ట్రాఫిక్‌కు అసలు కారణాలైన అక్రమ పార్కింగ్, ఫుట్‌పాత్ ఆక్రమణలు, రహదారులపై వాహనాల నిలుపుదలపై నిరంతర నిఘా, కఠిన చర్యలు తీసుకోవడంలో లోపం కనిపిస్తోందని పేర్కొంటున్నారు. కర్మన్‌ఘాట్ చౌరస్తా నగరంలోని ప్రధాన రవాణా కూడళ్లలో ఒకటిగా ఉండటంతో ప్రతిరోజూ వేలాది వాహనాలు ఈ మార్గంలో ప్రయాణిస్తున్నాయి. ఇలాంటి కీలక ప్రాంతంలో ట్రాఫిక్ నిర్వహణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని, హోటళ్లు, వైన్స్ దుకాణాల వద్ద తప్పనిసరిగా పార్కింగ్ సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే పార్కింగ్ నిబంధనలను పునఃసమీక్షించాలని సూచిస్తున్నారు. అలాగే జీహెచ్‌ఎంసీ అధికారులు ఫుట్‌పాత్‌లను ఆక్రమణల నుంచి విముక్తి చేసి పాదచారులకు అందుబాటులోకి తీసుకురావాలని, ట్రాఫిక్ పోలీసులు, రవాణా శాఖ, జీహెచ్‌ఎంసీ సంయుక్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజల భద్రత, సాఫీ రాకపోకలు, అత్యవసర సేవల వాహనాల నిరాటంక ప్రయాణం దృష్ట్యా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి కర్మన్‌ఘాట్ చౌరస్తాలో నెలకొన్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story