- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహాత్మా జ్యోతిబా పూలే గురుకులంలో ఘోరం..
కాగజ్‌నగర్‌లోని మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాలలో శనివారం నాడు జరిగిన ఒక దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

దిశ, కాగజ్‌నగర్: కాగజ్‌నగర్‌లోని మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాలలో శనివారం నాడు జరిగిన ఒక దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. క్రమశిక్షణకు మారుపేరుగా నిలవాల్సిన గురుకులంలో తోటి విద్యార్థులే ఓ బాలికపై ఘాతుకానికి ఒడిగట్టడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. సభ్యుల కథనం ప్రకారం.. దాహేగాం మండలానికి చెందిన ఉషాన్ శృతి సదరు గురుకులంలో పదో తరగతి చదువుతోంది. శనివారం పాఠశాల ఆవరణలోనే కొందరు తోటి విద్యార్థులు కలిసి శృతి కళ్లకు గంతలు కట్టారు. ఆపై వెనుక వైపు నుండి ఆమెను గట్టిగా పట్టుకుని, నోట్లోకి బలవంతంగా పెన్ క్యాప్‌ను తోసి మింగించారు.
ఘటనపై కేసు నమోదు...
వెంటనే అప్రమత్తమైన తల్లిదండ్రులు ఆమెను మంచిర్యాలలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అత్యవసరంగా ఎండోస్కోపీ ప్రక్రియను నిర్వహించి, కడుపులో ఉన్న పెన్ క్యాప్‌ను క్షేమంగా బయటకు తీశారు. ప్రస్తుతం బాలిక ప్రాణాపాయం నుండి బయటపడింది. వారం రోజుల క్రితమే జిల్లా కలెక్టర్ స్వయంగా ఈ పాఠశాలను సందర్శించి వెళ్లినప్పటికీ ఇలాంటి అవాంఛనీయ ఘటన జరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వార్డెన్, పాఠశాల సిబ్బంది పర్యవేక్షణ లోపం మరియు నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ ప్రాణాల మీదికి వచ్చిందని, తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. రూలర్ సబ్ ఇనస్పెక్టర్ సందీప్ కుమార్ సమాచారం అందుకున్న వెంటనే సదరు గురుకుల పాఠశాలపై ఘటనపై కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నామని తెలిపారు.






