- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అవార్డుల వివాదంపై స్పందించిన రాజేంద్ర ప్రసాద్.. చిరంజీవికి సపోర్ట్ చేయడం లేదంటూ కామెంట్స్
తాను చిరంజీవిని సమర్థిస్తున్నానని అనుకోవద్దని, ప్రతి మాటకూ తప్పుడు అర్థాలు వెతకడం సరికాదని రాజేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు.

దిశ, సినిమా: టాలీవుడ్ సీనియర్ నటుడు, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డుతో సత్కరించిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. అయితే ఇదే కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి అవార్డ్ రావడానికి ఎన్నో దారులు ఉంటాయని అనడం గమనార్హం. ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారాయి. ఈ విషయంపై నెటిజన్లు విమర్శలు గుప్తిస్తున్నారు. ఈనేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజేంద్ర ప్రసాద్ ఈ విషయంపై స్పందించారు. చిరంజీవి ఆ మాటలను ఏ మూడ్‌లో, ఏ సందర్భంలో అన్నారో తనకు తెలియదని రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ప్రతి విషయాన్ని నెగిటివ్‌గా చూడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఇటీవల తాను తిరుమల శ్రీవారిని దర్శించుకుని బయటకు వచ్చినప్పుడు.. ఈ పద్మశ్రీ అవార్డు తనకు దేవుడే ఇప్పించాడని, తనకు అంత సీన్ లేదని సరదాగా అన్నానని గుర్తుచేసుకున్నారు.
కానీ కొందరు మీడియా వాళ్లు రాజేంద్ర ప్రసాద్‌కు అంత సీన్ లేదు అంటూ థంబ్ నైల్స్, హెడ్‌లైన్స్ పెట్టేసి వివాదం చేశారని చెప్పారు. అలాగే చిరంజీవి కూడా ఏదో వేరే సందర్భంలో ఆ మాటలు అని ఉంటారని తాను భావిస్తున్నట్లు తెలిపారు. అలా అని తాను చిరంజీవిని సమర్థిస్తున్నానని అనుకోవద్దని, ప్రతి మాటకూ తప్పుడు అర్థాలు వెతకడం సరికాదని రాజేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. సినిమా అవార్డుల విషయంలో ఉత్తరాది, దక్షిణాది మధ్య వివక్ష ఉందనే చర్చ ఎప్పటి నుంచో ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. చిరంజీవికి ఇప్పటికే ఎన్నో బ్రహ్మాండమైన అవార్డులు వచ్చాయని, ఈ రోజు దేశంలోనే అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తుల్లో ఆయన ఒకరని ప్రశంసించారు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న వివాదాలను విన్నా.. అప్పుడే వదిలేయడం మంచిదని సూచించారు. అవార్డులను మనం అడిగి తీసుకుంటే అది భిక్ష అవుతుందని, అదే మన ప్రతిభను గుర్తించి వాళ్లే పిలిచి ఇస్తే అది నిజమైన గౌరవమని రాజేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు.






