- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిన్నాకు చికిత్స.. గల్లంతైన మత్స్యకారుల కోసం ముమ్మర గాలింపు: సీఎం చంద్రబాబు పర్యవేక్షణ
సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం కోస్ట్ గార్డ్, నేవీ, మెరైన్ పోలీసులు సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం కోస్ట్ గార్డ్, నేవీ, మెరైన్ పోలీసులు సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ గాలింపు చర్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు.
ప్రమాదం ఎలా జరిగిందంటే..?
అధికారుల సమాచారం ప్రకారం.. జూలై 1వ తేదీన విశాఖపట్నం నుంచి మొత్తం ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో వేటకు బయలుదేరారు. జూలై 4 మధ్యాహ్నం ‘ఇంకో గంటలో వస్తున్నాం’ అని వారు తమ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పారు. అదే రోజు భారీ అలల ధాటికి వారి బోటు గంగవరం పరిసర ప్రాంతాల్లో బోల్తా పడింది. ఆ రోజు రాత్రి కర్రీ చిన్నా అనే మత్స్యకారుడిని ఒక మర్చంట్ నేవీ నౌక సురక్షితంగా రక్షించింది. ఆయన ఇచ్చిన కీలక సమాచారం ఆధారంగా, గల్లంతైన మిగిలిన ఆరుగురు మత్స్యకారుల కోసం ప్రస్తుతం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
రంగంలోకి యుద్ధ నౌకలు, హెలికాప్టర్లు
బోటు బోల్తా పడిన పరిసరాలతో పాటు, తీరం నుంచి 12 నాటికల్ మైళ్ల పరిధిలో గాలింపును విస్తృతం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. సమాచారం అందిన వెంటనే ‘ఐసీజీఎస్ కనక్ లతా బరువా’, ‘ఐసీజీఎస్ వీర’ నౌకలతో పాటు మూడు హెలికాప్టర్లను గాలింపు చర్యలకు పంపారు. తూర్పు నౌకాదళ కమాండ్ (ENC) నుంచి రెండు యుద్ధ నౌకలు, ఒక సీ కింగ్ హెలికాప్టర్, ఒక అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ (ALH) సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్లు సమాచారం
చిన్నాకు చికిత్స.. నిరంతర గాలింపు
మత్స్యకారుల ఆచూకీ దొరికే వరకూ అన్ని వనరులతో రెస్క్యూ ఆపరేషన్ నిరంతరాయంగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ స్పష్టం చేశారు. ఈ మొత్తం ఆపరేషన్‌ను విశాఖపట్నంలోని రీజినల్ ఆపరేషన్స్ సెంటర్ (ROC) ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. కాగా, సురక్షితంగా ఒడ్డుకు చేరిన కర్రి చిన్నాకు కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని, ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కలెక్టర్ తెలిపారు. తీర ప్రాంతాల్లో గస్తీని మరింత కట్టుదిట్టం చేసి తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.






