భువనగిరి మాజీ ఎమ్మెల్యే మృతి..

by Kodari Anjali |

భువనగిరి మాజీ ఎమ్మెల్యే, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, నిరాడంబర ప్రజానేత కొమ్మిడి నరసింహారెడ్డి మంగళవారం ఉదయం కన్నుమూశారు.

భువనగిరి మాజీ ఎమ్మెల్యే మృతి..
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి: భువనగిరి మాజీ ఎమ్మెల్యే, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, నిరాడంబర ప్రజానేత కొమ్మిడి నరసింహారెడ్డి మంగళవారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఉదయం 5 గంటలకు తుదిశ్వాస విడిచారు. ప్రజా సమస్యల పరిష్కారమే జీవిత లక్ష్యంగా భావించి, రాజకీయాలను ప్రజాసేవకు వేదికగా మలుచుకున్న నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. నిజాయితీ, విలువలతో కూడిన రాజకీయాలకు, నిరాడంబర జీవితానికి ఆయన నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన కొమ్మిడి నరసింహారెడ్డి రామచంద్రరెడ్డి, లక్ష్మమ్మ దంపతులకు నాలుగో సంతానంగా జన్మించారు. భార్య సుకన్య. రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా ఆస్తులు కూడబెట్టకుండా, ఒక పాత స్కూటర్ మినహా సొంత ఇల్లు కూడా నిర్మించుకోకుండా నిరాడంబర జీవితాన్ని గడిపారు. ప్రజల విశ్వాసమే తన అసలైన సంపదగా భావించిన నాయకుడిగా గుర్తింపు పొందారు.

1969 తెలంగాణ ఉద్యమం నుంచి శాసనసభ వరకు సాగిన ప్రజా ప్రస్థానం..

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకునే రోజుల నుంచే ఆయన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ప్రియ శిష్యుడిగా గుర్తింపు పొందిన ఆయన, 1969 తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు. మర్రి చెన్నారెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం ఉద్యమించారు.

సర్పంచ్‌గా ప్రారంభమైన ప్రయాణం.. రెండుసార్లు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ...

కేవలం 19 ఏళ్ల వయసులోనే 1962లో బ్రాహ్మణపల్లి గ్రామ సర్పంచ్‌గా ఎన్నికై ప్రజా జీవితాన్ని ప్రారంభించారు. 1967లో రెండోసారి సర్పంచ్‌గా ఎన్నికై గ్రామాభివృద్ధికి కృషి చేశారు. అనంతరం భువనగిరి సమితి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ప్రజలకు మరింత చేరువయ్యారు. తన హయాంలో అనేక మందికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా, పలు గ్రామాలు, తండాలను గ్రామపంచాయతీలుగా గుర్తించేలా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి కృషి చేశారు. 1978లో కాంగ్రెస్ పార్టీ తరఫున భువనగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన, 1983లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ ప్రభంజనాన్ని తట్టుకొని మరోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1978 నుంచి 1985 వరకు ప్రజాప్రతినిధిగా సేవలందించారు. పదవిలో ఉన్నా, లేకపోయినా ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేశారు.

గోదావరి జలాల కోసం జీవితాంతం సాగిన అధ్యయనం, ఉద్యమం...

తెలంగాణలో సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ఆయన జీవితాంతం అధ్యయనం చేశారు. గోదావరి జలాలను మూసీ నదిలోకి మళ్లించి లక్ష ఎకరాలకు సాగునీరు అందించే ప్రణాళికను రూపొందించారు. భారీ వ్యయం లేకుండా అమలు చేయగల మార్గాన్ని సూచిస్తూ స్వయంగా బ్లూప్రింట్లు, మ్యాపులు రూపొందించి రైతులు, ప్రజాప్రతినిధులు, అధికారులకు వివరించేవారు. భువనగిరి ప్రాంతానికి గోదావరి జలాలు తీసుకురావాలని ప్రతి ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పిస్తూ నిరంతరం పోరాడారు.

సీసీఎంబీ, నిమ్స్ కోసం ప్రభుత్వాలపై నిరంతర ఒత్తిడి..

భువనగిరి ప్రాంత అభివృద్ధి కోసం సీసీఎంబీ సంస్థను తీసుకురావాలని మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. మొదట బీబీనగర్ సమీపంలో ఏర్పాటు చేయాలని సూచించి, అనంతరం ఈస్ట్ సిటీలో భూ సేకరణ జరిగేలా కృషి చేశారు. అలాగే నిమ్స్ యూనివర్సిటీ ఏర్పాటును స్వాగతిస్తూ ప్రభుత్వం త్వరగా పనులు పూర్తి చేయాలని పలుమార్లు విజ్ఞప్తి చేశారు. నిమ్స్ అభివృద్ధి పనులు ఆలస్యం కావడాన్ని నిరసిస్తూ తన ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా నిమ్స్ ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు. ఆయన పోరాటం నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం స్పందించి రూ.60 కోట్ల నిధులు మంజూరు చేసింది. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందాలన్నదే ఆయన లక్ష్యంగా నిలిచింది.

భుజాన సంచి.. చేతిలో నోటుపుస్తకంతో ప్రజల మధ్యే జీవితం...

భుజానికి చిన్న సంచి, అందులో ఒక జత బట్టలు, సద్దికట్టుతో రాష్ట్రవ్యాప్తంగా జరిగే సమావేశాలకు హాజరవుతుండేవారు. సభల్లో మాట్లాడిన అంశాలను చిన్న నోటుపుస్తకంలో నమోదు చేసుకుంటూ జీవితాంతం విద్యార్థిలా నేర్చుకుంటూ ప్రజా సమస్యలకు పరిష్కారాలు అన్వేషించారు.

సాయుధ పోరాట స్ఫూర్తిని వారసత్వంగా తీసుకున్న కుటుంబం..

కొమ్మిడి నరసింహారెడ్డి కుటుంబానికి తెలంగాణ సాయుధ పోరాటంతో విడదీయరాని అనుబంధం ఉంది. ఆయన పెద్దన్న కొమ్మిడి కోదండరామిరెడ్డి తెలంగాణ సాయుధ పోరాట యోధుడిగా నిజాం పాలన, రజాకారులు, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణత్యాగం చేశారు. ఆ ఉద్యమ స్ఫూర్తినే వారసత్వంగా తీసుకున్న కొమ్మిడి నరసింహారెడ్డి ప్రజా సమస్యలపై మేధావులు, సంఘసంస్కర్తలతో నిరంతరం చర్చిస్తూ ప్రజా ఉద్యమాలకు అండగా నిలిచారు.

Next Story