- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఊపిరి పీల్చుకున్న తీరం.. పారాదీప్‌కు సురక్షితంగా 10 మంది ఏపీ మత్స్యకారులు
నడి సముద్రంలో బోటు ఇంజిన్ చెడిపోయి ప్రాణాపాయ స్థితిలో చిక్కుకున్న 10 మంది ఆంధ్రప్రదేశ్ (విశాఖ) మత్స్యకారులు క్షేమంగా ఒడిశాలోని పారాదీప్ తీరానికి ఇవాళ చేరుకున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: నడి సముద్రంలో బోటు ఇంజిన్ చెడిపోయి ప్రాణాపాయ స్థితిలో చిక్కుకున్న 10 మంది ఆంధ్రప్రదేశ్ (విశాఖ) మత్స్యకారులు క్షేమంగా ఒడిశాలోని పారాదీప్ తీరానికి ఇవాళ చేరుకున్నారు. ఏపీ, ఒడిశా ప్రభుత్వాల సమన్వయంతో చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం కావడంతో తీరప్రాంతంలో నెలకొన్న ఆందోళన కాస్త చల్లారింది.
రెస్క్యూ ఆపరేషన్ సాగిందిలా..
అధికారుల వివరాల ప్రకారం.. విశాఖకు చెందిన ఓ మత్స్యకార బోటు సముద్రంలో వేటకు వెళ్లిన క్రమంలో ఇంజిన్ ఫెయిల్యూర్ అయింది. దీంతో అలల ఉధృతికి బోటు ఒడిశా వైపు కొట్టుకుపోయింది. ప్రమాదంలో చిక్కుకున్నామని మత్స్యకారులు వీడియో పంపడంతో ఏపీ ప్రభుత్వం తక్షణమే స్పందించింది. ఒడిశా ప్రభుత్వం, కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసులు, మత్స్యశాఖ అధికారులతో సమన్వయం చేసుకుని వారిని కాపాడారు. ప్రస్తుతం వీరందరినీ పారాదీప్ నుంచి విశాఖకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన సహాయ సిబ్బందిని డీఐజీ గోపీనాథ్ జెట్టి ప్రత్యేకంగా అభినందించారు.
ఆరుగురు గల్లంతు.. వరుసగా బోటు ప్రమాదాలు
గత మూడు రోజుల వ్యవధిలో ఏపీ తీరంలో వరుసగా మూడు సముద్ర ప్రమాదాలు జరగడం మత్స్యకారులను కలవరపెడుతోంది. జూలై 4న విశాఖ తీరానికి 10 మైళ్ల దూరంలో వాతావరణం అనుకూలించక ఓ బోటు బోల్తా పడింది. మర్చంట్ నౌక సిబ్బంది సాయంతో డ్రైవర్ చిన్నా ప్రాణాలతో బయటపడగా.. మరో ఆరుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారు. అదే సమయంలో అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం రేవుపోలవరం వద్ద మరో బోటు తిరగబడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సురక్షితంగా ఒడ్డుకు చేరగా, చోడీపల్లి సింహాద్రి అనే మత్స్యకారుడు మృతి చెందాడు. ఈ రెండు విషాద ఘటనల నేపథ్యంలో, తాజాగా సముద్రంలో చిక్కుకున్న 10 మంది మత్స్యకారులు క్షేమంగా తిరిగి రావడంతో వారి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.






