- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రాజెక్టులు.. రాజకీయాలు.. పాలమూరుపై సీఎం ప్రత్యేక ఫోకస్
ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాధించిన తిరుగులేని రాజకీయ ఆధిపత్యాన్ని ఏమాత్రం సడలకుండా చూసుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది.

దిశ, మహబూబ్‌నగర్ బ్యూరో: ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాధించిన తిరుగులేని రాజకీయ ఆధిపత్యాన్ని ఏమాత్రం సడలకుండా చూసుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్లకు పైగా సమయం ఉన్నప్పటికీ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో గులాబీ కోటలో ‘చేయి’ పట్టు మరింత బిగుసుకుంటోంది. గత ఎన్నికల్లో జిల్లాలోని 14 స్థానాలకు గాను ఏకంగా 12 సీట్లు గెలుచుకున్న హస్తం పార్టీ.. గద్వాల ఎమ్మెల్యే చేరికతో ఆ సంఖ్యను 13కు పెంచుకుని తిరుగులేని శక్తినని నిరూపించుకుంది. అయితే, జిల్లా బిడ్డ ముఖ్యమంత్రి అయినా ప్రాజెక్టుల పనులు ఆశించిన స్థాయిలో సాగకపోవడంపై తలెత్తుతున్న అసంతృప్తిని ముందే పసిగట్టిన అధికార పార్టీ మంత్రులు.. ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప చేస్తున్నారు.
సీఎం రెండు రోజుల పర్యటనతో..
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దశాబ్దాలుగా నలుగుతున్న పెండింగ్ ప్రాజెక్టుల సమస్యను అస్త్రంగా చేసుకుని బీఆర్‌ఎస్, ప్రజాసంఘాలు ఉద్యమబాట పట్టేందుకు సిద్ధమవుతున్న తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. గత నెలలోనే రెండు రోజుల పాటు జిల్లాలో సుడిగాలి పర్యటనలు చేసి, క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించారు. వచ్చే డిసెంబర్ నాటికి పెండింగ్ పనులన్నింటినీ పూర్తి చేయడంతో పాటు.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా కనీసం కరివేనా రిజర్వాయర్ వరకు సాగునీరు తెచ్చి తీరుతామని ప్రజలకు గట్టి నమ్మకం కలిగించారు.
గులాబీ బాస్‌లపైనే నేరుగా దాడి..
స్థానిక బీఆర్‌ఎస్ నేతలను పెద్దగా పట్టించుకోకుండా నేరుగా కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులనే టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి విమర్శల పదును పెంచారు. 2024లో మొదలైన మా పాలన 2034 దాకా సాగుతుంది.. బీఆర్‌ఎస్‌ను జనం ఎప్పుడో బొంద పెట్టారు, కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితం అంటూ క్యాడర్‌లో జోష్ నింపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ప్రతిపక్షానికి ఒక్క సీటు కూడా దక్కనివ్వనని సవాల్ విసరడం ద్వారా విపక్షాల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు.
సెంటిమెంట్‌తో వ్యాఖ్యానాలు..
రాజకీయ విమర్శలతో పాటు సెంటిమెంట్‌ను కూడా సీఎం రేవంత్ సమాంతరంగా వాడుకుంటున్నారు. మిడ్జిల్ ప్రజలు నాటిన చిన్న మొక్క ఇవాళ మహావృక్షమై రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసింది.. ఈ ప్రాంతాన్ని ఇప్పుడే అభివృద్ధి చేసుకోకపోతే ఇంకెప్పుడు చేసుకుంటాం? అంటూ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించారు. ముఖ్యంగా మహిళా ఓటర్లను ఆకట్టుకునేలా సాగుతున్న సీఎం ప్రసంగాలు జిల్లా రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి. విపక్షాల వ్యూహాలకు ముందే ప్రతివ్యూహాలతో చెక్ పెడుతూ.. పాలమూరు గడ్డపై కాంగ్రెస్ పట్టు సడలకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో పార్టీ వర్గాలు వ్యూహరచనలు చేసుకొని ముందుకు సాగుతున్నట్లు సమాచారం.






