- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెళ్లి చూపుల ఆనందం.. క్షణాల్లో విషాదం
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట సమీపంలోని జాతీయ రహదారి-65పై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

దిశ, కోదాడ : సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట సమీపంలోని జాతీయ రహదారి-65పై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూసుమంచి నుంచి ముత్యాల గ్రామానికి వెళ్తున్న ఆటోను హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న స్కార్పియో కారు వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. దీంతో ఆటో నుజ్జునుజ్జైంది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం ముత్యాల గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులు ఖమ్మం జిల్లా కూసుమంచి గ్రామానికి పెళ్లి సంబంధం చూసేందుకు వెళ్లి, తిరుగు ప్రయాణంలో ఆటోలో స్వగ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో దొరకుంట సమీపానికి చేరుకున్న సమయంలో వెనుక నుంచి అత్యంత వేగంగా వచ్చిన స్కార్పియో కారు ఆటోను బలంగా ఢీకొట్టింది. ఢీ కొట్టిన ప్రభావంతో ఆటో రోడ్డుపై పల్టీలు కొట్టగా, అందులో ప్రయాణిస్తున్న వారు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ప్రమాదంలో మూడవత్ రామకోటేశ్వరరావు (40) అక్కడికక్కడే మృతి చెందాడు. మూడవత్ నరసింహ నాయక్, మూడవత్ మహేంద్ర సింగ్ నాయక్, అజ్మీరా ఎలమంద, మూడవత్ కాళేశ్వరరావు, మూడవత్ వరలక్ష్మి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టి, 108 అంబులెన్స్ సిబ్బందికి సమాచారం అందించారు. క్షతగాత్రులను తొలుత కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పెళ్లి సంబంధం చూసుకొని ఆనందంగా స్వగ్రామానికి తిరిగి వస్తున్న కుటుంబ సభ్యులు, బంధువులు ప్రమాదానికి గురికావడంతో ముత్యాల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.






