గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో అపశ్రుతి.. 17 ఏళ్ల బాలిక మృతి

by Nallavelli.Anjaneyulu |

జోగులాంబ గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది.

గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో అపశ్రుతి.. 17 ఏళ్ల బాలిక మృతి
X

దిశ, గద్వాల క్రైం : జోగులాంబ గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. అపెండిక్స్ ఆపరేషన్ కోసం వచ్చిన ఎర్రవల్లి మండల కేంద్రానికి చెందిన ఇందు (17) ఏళ్ల బాలిక చికిత్స అందక మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కొంతకాలంగా అపెండిక్స్ నొప్పితో బాధపడుతున్న బాలిక , మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి రాగా, సరైన సమయంలో చికిత్స అందక ఆమె ప్రాణాలు కోల్పోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

బాలిక మృతి భయటకు పొక్కకుండా సిబ్బంది ప్రయత్నం

బాలిక మృతి చెందిన వెంటనే ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తమై, విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తపడ్డారు. మృతదేహాన్ని హుటాహుటిన అంబులెన్స్‌లో ఎక్కించి, కుటుంబ సభ్యులకు సర్దిచెప్పి ఆమె స్వగ్రామమైన ఎర్రవల్లి చౌరస్తాకు పంపించివేశారు. ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు, యువకులు, పెద్దమనుషులు సిబ్బంది తీరును తప్పుబట్టారు. మరణానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, అంబులెన్స్‌ను తిరిగి గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసుల యత్నం

గ్రామస్తులను బాలిక కుటుంబసభ్యులను శాంతింపజేసి, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బాధ్యులపై విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంపై నిరసనలు వెల్లువెత్తుతుండటంతో, గద్వాల ఆసుపత్రి వద్ద భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. బాధ్యతారహితంగా వ్యవహరించిన సిబ్బందిపై, డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అంబులెన్స్ తిరిగి ఆసుపత్రికి రావడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రూరల్ ఎస్సై శ్రీకాంత్ తన బృందంతో అక్కడికి చేరుకుని, బాలిక కుటుంబ సభ్యులకు, గ్రామస్తులకు నచ్చజెప్పి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే, మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, న్యాయం జరిగే వరకు కదిలేది లేదని కుటుంబ సభ్యులు పట్టుబట్టారు. ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద రోడ్డుకు అడ్డంగా పడుకొని వారు తీవ్ర నిరసన తెలుపుతున్నారు.

Next Story