భయంభయంగా చదువులు.. చిన్నారుల ప్రాణాలతో చెలగాటం!

by Jakkula.Mamatha |

అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట. వ్యవస్థీకృత నేరానికి సజీవ సాక్ష్యం వెంకటాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల.

భయంభయంగా చదువులు.. చిన్నారుల ప్రాణాలతో చెలగాటం!
X

దిశ, వెంకటాపూర్: అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట. వ్యవస్థీకృత నేరానికి సజీవ సాక్ష్యం వెంకటాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల. బడిగంట మోగినా పాఠశాల భవనానికి మాత్రం మరమ్మతులు చేయలేదు. ఏ క్షణంలోనైనా కూలిపోయే ప్రమాదం నెలకొంది. పాఠశాలలో 32మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. బడిబాటలో భాగంగా ఆర్భాటంగా ప్రచారం నిర్వహించిన కనీస సౌకర్యాల కల్పనపై పట్టింపు లేకుండా పోయింది. పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుంది. స్లాబ్​పై పెచ్చులు ఊడి కింద పడుతున్నాయి. ఊచలు తేలి ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి. ఆ భవనంలోనే విద్యార్థులు భయం భయంగా విద్యనభ్యసిస్తున్నారు. పెచ్చులు ఊడుతున్న పైకప్పు కింద కూర్చుని చదువుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ప్రభుత్వం, విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు.

ఒక్కరే మాస్టర్..

డిజిటల్ యుగం స్మార్ట్ క్లాసుల కాలంలో వెంకటాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఒక్కరే ఉపాధ్యాయుడు దిక్కయ్యారు. ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు ఉన్న 32 మంది పిల్లలకూ ఒక్కరే ఉపాధ్యాయుడు. ఒకే గదిలో ఐదు తరగతుల పిల్లలను కూర్చోబెట్టి పాఠాలు చెప్పాల్సిన పరిస్థితి. వర్షం వస్తే పైకప్పు నుంచి నీరుకారి పుస్తకాలు తడిసిపోతున్నాయి. బురదలోనే కూర్చుని చిన్నారులు భయంభయంగా చదవాల్సిన దుస్థితి.

వండడానికి వంట మనిషి లేదు..

ఈ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం పరిస్థితి అధ్వానంగా మారింది. నిల్వ చేసిన బియ్యం మొత్తం పురుగులు, బూజు పట్టి దారుణంగా ఉన్నాయి. మరోవైపు వంట చేసేందుకు అసలు వంట మనిషే లేదు. ఓ వృద్ధురాలితో తాత్కాలికంగా వంట చేయిస్తుండగా ఆరోగ్యం బాగాలేక ఆమె బడికి రావడం మానేసింది. దీంతో మధ్యాహ్న భోజనం కోసం వంటే చేసేవారు లేక పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు. రెండు వారాల క్రితమే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ, ఉపాధ్యాయులు కలిసి ఎంఈఓ, ఎంపీడీఓ, తహసీల్దార్, డీఈఓ, స్థానిక ఎమ్మెల్యే, మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికైనా పాఠశాలకు మరమ్మతులు చేపట్టాలని, ఉపాధ్యాయులను నియమించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. లేకుంటే స్థానిక యువకులతో కలిసి కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు. చిన్నారులకు ఏ ప్రమాదం జరిగినా విద్యాశాఖ అధికారులదే పూర్తి బాధ్యత అని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు.

Next Story