‘రామాయణ’లో పవర్‌ఫుల్ పాత్ర చేయడం గర్వంగా ఉంది: సన్నీ డియోల్

by Mallepaka Hamsa |

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులంతా ‘రామాయణ’ సినిమా కోసం ఎంతో ఉత్సాహంగా, ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

‘రామాయణ’లో పవర్‌ఫుల్ పాత్ర చేయడం గర్వంగా ఉంది: సన్నీ డియోల్
X

దిశ, సినిమా: భారతీయ ఇతిహాసం ఆధారంగా వెండితెరపై ఇప్పటివరకు ఎన్నడూ చూడని విధంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న విజువల్ వండర్ మూవీ ‘రామాయణ’. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా దాదాపు రూ. 4000 కోట్ల బడ్జెట్‌తో నిర్మి్స్తున్నారు. ఈ మైథలాజికల్ డ్రామాలో బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ రాముడిగా, నాచురల్ బ్యూటీ సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. అలాగే కన్నడ రాకింగ్ స్టార్ యష్ రావణాసురుడిగా, బాలీవుడ్ సీనియర్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ హనుమంతుడి పాత్రలో కనిపిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని మేకర్స్ రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారు. అందులో మొదటి భాగం ఈ ఏడాది 2026 దీపావళి కానుకగా విడుదల కానుండగా, రెండవ భాగం వచ్చే ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో, తాజాగా హనుమంతుడి పాత్రను పోషిస్తున్న సన్నీ డియోల్ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సినిమా గురించి ఆయన మాట్లాడుతూ.. "ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులంతా ‘రామాయణ’ సినిమా కోసం ఎంతో ఉత్సాహంగా, ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. నిజానికి, మనమందరం చిన్నప్పటి నుండి రామాయణ కథలను వింటూ, ఆ విలువలతోనే పెరిగాము. అలాంటి మన పవిత్ర ఇతిహాసాన్ని నేటి తరం ప్రేక్షకులకు, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్‌కు సరికొత్తగా అందించేందుకు ఇంత భారీ బడ్జెట్‌తో మేకర్స్ ముందుకు రావడం నిజంగా అద్భుతమైన విషయం. ఈ కథను వెండితెరపై చూడటం అందరికీ ఒక గొప్ప అనుభూతిని ఇస్తుంది" అని చెప్పారు. అలాగే తన పాత్ర గురించి మాట్లాడుతూ.. "ఈ గొప్ప దృశ్యకావ్యంలో హనుమంతుడి లాంటి పవర్‌ఫుల్ భక్తిపూర్వకమైన పాత్రను నేను పోషిస్తుండటం నాకు చాలా గర్వంగా ఉంది. ఈ క్యారెక్టర్ చేయడం పట్ల నేను కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నాను" అంటూ సన్నీ డియోల్ తన ఆనందాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.

Next Story