గోదావరిలో ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఆత్మహత్య.. ఎట్టకేలకు దొరికిన డెడ్ బాడీ

by Naga Rani Yarlagadda |

నిశ్చితార్థం.. ఆ తర్వాత పెళ్లి. ఓ వైపు ఏర్పాట్లు జరుగుతుంటే.. పలుమార్లు తనను పోలీసులు కౌన్సెలింగ్ కు పిలవడంపై మనస్తాపం చెందిన ఏపీఎస్పీ కానిస్టేబుల్ వంశీ.. నిన్న గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

గోదావరిలో ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఆత్మహత్య.. ఎట్టకేలకు దొరికిన డెడ్ బాడీ
X

దిశ, వెబ్‌డెస్క్: నిశ్చితార్థం.. ఆ తర్వాత పెళ్లి. ఓ వైపు ఏర్పాట్లు జరుగుతుంటే.. పలుమార్లు తనను పోలీసులు కౌన్సెలింగ్ కు పిలవడంపై మనస్తాపం చెందిన ఏపీఎస్పీ కానిస్టేబుల్ వంశీ.. నిన్న గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. రోడ్ కమ్ రైలు వంతెన పై నుంచి కానిస్టేబుల్ చంద్రమళ్ల వంశీ గోదావరిలో దూకినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే రంగంలోకి దిగిన SDRF టీమ్స్ అతని ఆచూకీ కోసం తీవ్రంగా గాలించాయి. ఎట్టకేలకు అతని మృతదేహం లభ్యమవ్వగా.. పోస్టుమార్టమ్ కోసమై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గురువారం రాత్రే తాను చనిపోతున్నట్లు వంశీ తన తండ్రికి ఫోన్ చేసి చెప్పగా.. కుటుంబ సభ్యులు కంగారుపడ్డారు. ఆ తర్వాత ఎన్నిసార్లు కాల్ చేసినా కలవకపోవడంతో పోలీసుల్ని ఆశ్రయించారు. నిశ్చితార్థం రోజునే వంశీ మరణించడంతో అటు ఆడపెళ్లివారింట కూడా విషాదఛాయలు అలుముకున్నాయి.

కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రాజానగరం సమీపంలోని శ్రీరాంపురానికి చెందిన వంశీకి ఇటీవలే పెళ్లి సంబంధం కుదిరింది. శుక్రవారం నిశ్చితార్థం జరగాల్సి ఉండగా.. ఓ మహిళా కానిస్టేబుల్ అతనిపై వేధింపుల ఫిర్యాదు చేసింది. ఈ విషయమై పోలీసులు అతన్ని పలుమార్లు కౌన్సెలింగ్ కు పిలిపించారు. పదే పదే పిలవడంతో మనస్తాపానికి గురైన వంశీ.. ఆత్మహత్య చేసుకున్నాడు. మహిళా కానిస్టేబుల్ వేధింపులవల్లే తన కొడుకు చనిపోయాడని, ఆమె పై చర్యలు తీసుకోవాలని వంశీ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story