​అధికారుల మాయాజాలం.. చనిపోయిన వ్యక్తికి మళ్లీ పెళ్లి!

by Jakkula.Mamatha |   (  Updated:2026-06-20 07:02:35  IST  )

అది పేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక భారం కాకూడదని తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన 'కల్యాణలక్ష్మి' పథకం.

​అధికారుల మాయాజాలం.. చనిపోయిన వ్యక్తికి మళ్లీ పెళ్లి!
X

దిశ,బూర్గంపాడు: అది పేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక భారం కాకూడదని తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన 'కల్యాణలక్ష్మి' పథకం. కానీ,కొందరు అవినీతి తిమింగలాలకు, దళారులకు మాత్రం అది కాసుల కురిపించే కామధేనువుగా మారింది. ఎంతలా అంటే.. ఏకంగా 2023లో చనిపోయిన ఒక యువకుడిని 2024లో బతికించి, అతనికి పెళ్లి చేసి, ప్రభుత్వ సొమ్మును జేబుల్లో వేసుకునేంతగా! అవును,మీరు చదివింది నిజమే..చనిపోయిన వ్యక్తి మళ్లీ పెళ్లి పీటలెక్కినట్టు కాగితాలు సృష్టించి, పథకం నిధులను కాజేశారు.

​​భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మున్సిపల్ పరిధిలోని శివలింగాపురం గ్రామానికి చెందిన పచ్చాల సాయి కుమార్ అనే యువకుడు ఆర్థిక ఇబ్బందులు తాళలేక 19 సెప్టెంబర్ 2023న గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. వైద్యం అందేలోపే సాయికుమార్ ప్రాణాలు విడిచాడు. మృతుడి తల్లి శైలజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మణుగూరు పోలీసులు దీనిని ఆత్మహత్యగా కేసు కూడా నమోదు చేశారు. కాగా, సాయి కుమార్ కి అప్పటికే వివాహమై ఒక బాబు కూడా ఉన్నాడు.

​మరణించిన వ్యక్తికి 'కళ్యాణ లక్ష్మి' పెళ్లి!

​ఇక్కడే అక్రమార్కుల అసలు నాటకం మొదలైంది. 2023లో చనిపోయిన సాయి కుమార్,2024లో బతికొచ్చి పెళ్లి చేసుకున్నట్లు రికార్డులు పుట్టించారు. ఇదునూరి సాయి ప్రసన్న అనే యువతిని సాయి కుమార్ 10 మే 2024న పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నట్టు బూర్గంపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దొంగ పత్రాలు సమర్పించారు.

​ఆన్‌లైన్ రికార్డుల సాక్ష్యం ఇదే:

ప్రభుత్వ అధికారిక ఈ-పాస్ (http://epass.cgg.gov.in) వెబ్‌సైట్‌లో ఈ ఘోరం స్పష్టంగా కనిపిస్తోంది.

​Marriage ID: 2024KL221291251

​Bride Name: EDUNURI SAI PRASANNA

​Date of Marriage: 10-05-2024

​2023లోనే శ్మశానానికి చేరిన యువకుడు, 2024 మే నెలలో ఎలా పెళ్లి చేసుకున్నాడనే కనీస జ్ఞానం కూడా లేకుండా రెవెన్యూ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది.

​సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నిద్రపోతోందా?

​ఈ దొంగ పెళ్లికి సంబంధించిన సర్టిఫికెట్ అంత సులభంగా ఎలా వచ్చింది? అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. పక్కా దర్యాప్తు లేకుండా,కేవలం ఫొటోలతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సమర్పించిన ఫేక్ జంటను చూసి, ఇరువైపులా ఉన్న కొందరు పెద్ద మనుషుల సాక్షి సంతకాల ఆధారంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పెళ్లి ధృవీకరణ పత్రాన్ని జారీ చేసింది.అసలు వ్యక్తి ఉన్నాడా? లేదా? అని సరి చూడాల్సిన బాధ్యతను అధికారులు గాలికొదిలేశారు.

​కళ్లు మూసుకున్న రెవెన్యూ యంత్రాంగం..

​సబ్ రిజిస్ట్రార్ ఇచ్చిన ఫేక్ సర్టిఫికెట్ ఆధారంగా స్థానిక రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేయాల్సి ఉంది. కానీ, మణుగూరు రెవెన్యూ విభాగం తూతూమంత్రపు తనిఖీలతో సరిపెట్టింది. ఎలాంటి విచారణ లేకుండానే సాయి ప్రసన్న తల్లి సత్యవతి పేరున కల్యాణలక్ష్మి చెక్కును మంజూరు చేసి,పంపిణీ కూడా చేసేశారు.​ఒక యువకుడు బలవన్మరణానికి పాల్పడితే,ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం పరిధిలో ఎన్నో ఆసరా పథకాలు ఉన్నాయి.కానీ, చనిపోయిన వారిని కాగితాల్లో బతికించి ఇలా నిధులు నొక్కేయడం ఒక్క మణుగూరు రెవెన్యూ అధికారులకే సాధ్యమని స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. 2023 తర్వాత ఈ ప్రాంతంలో ఇలాంటి దొంగ కల్యాణలక్ష్మీ లబ్ధిదారులు పదుల సంఖ్యలో పుట్టుకొచ్చారని,స్థానిక అధికారులు ఉన్నతాధికారులను, పాలకులను బురిడీ కొట్టిస్తూ ఇష్టారాజ్యంగా చక్రం తిప్పుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

​​నిజమైన పేద కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లిళ్లకు అండగా నిలవాల్సిన ప్రభుత్వ సొమ్ము, ఇలా అక్రమార్కుల పాలవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పచ్చాల సాయికుమార్ పేరిట జరిగిన ఈ దొంగ పెళ్లి వ్యవహారం పై సమగ్ర విచారణ జరిపితే, మణుగూరు, బూర్గంపాడు పరిధిలో జరిగిన మరిన్ని కల్యాణలక్ష్మి కుంభకోణాలు,దొంగ లబ్ధిదారుల గుట్టు రట్టవుతుందని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి. ఈ విషయంపై బూర్గంపాడు సబ్ రిజిస్ట్రార్ మురళీకృష్ణను ‘దిశ’ వివరణ కొరేందుకు ప్రయత్నించగా అందుబాటులో లేరు.

Next Story