- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మట్టి దందా లెక్క.. చెరువుకే ఎరుక!
ఫరూక్ నగర్ మండలంలో జరుగుతున్న మట్టి దందాలో ఓ నేత పేరు బాహాటంగానే వినిపిస్తోంది.

దిశ, రంగారెడ్డి బ్యూరో: ఫరూక్ నగర్ మండలంలో జరుగుతున్న మట్టి దందాలో ఓ నేత పేరు బాహాటంగానే వినిపిస్తోంది. పెద్ద పెద్ద గుట్టలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. మట్టిదందాతోనే సదరు నేత రూ.కోట్లకు పడగలెత్తినట్లు స్థానికంగా ప్రచారం సైతం జరుగుతోంది. అక్రమంగా మట్టిని తరలిస్తూ అడపాదడపా లారీలు సైతం పట్టుబడుతున్నప్పటికీ అతని దందాకు ఎవరూ చెక్ పెట్టడం లేదు. అంతా అధికారుల కనుసన్నల్లోనే జరుగుతోంది అనటానికి ఇదొక ఉదాహరణ.
- కందుకూరు మండలంలో పెద్ద పెద్ద గుట్టలు రోజురోజుకూ కనుమరుగైపోతున్నాయి. ఎటువంటి అనుమతులు తీసుకోకుండా.. రాత్రింబవళ్లు అనే తేడా లేకుండా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. బేగరికంచ గ్రామానికి చెందిన ఓ మహిళ మట్టి లోడుతో వెళ్తున్న టిప్పర్ కింద పడి ప్రాణాలు కోల్పోయింది.
- కేశంపేట మండలం కొత్తపేట గ్రామ పరిధిలోని కోనాయ చెరువులో మట్టి తవ్వకాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మట్టి తరలింపునకు అనుమతులు తీసుకున్నప్పటికీ పరిమితికి మించి తవ్వకాలు జరిపి రవాణా చేస్తున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. అయినా అటువైపు అధికారులు కన్నెత్తి చూడటం లేదు.
- షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని బొబ్బిలి చెరువులో ఇటీవల ఇష్టానుసారంగా మట్టి తవ్వకాలు జరిపారు. వ్యవసాయ పొలాలకు తరలించేందుకు అనుమతులు పొంది మహేశ్వరం ప్రాంతంలోని లే అవుట్లు, ఇసుక బట్టీలకు నేతలు తరలించి సొమ్ము చేసుకున్నారు. దీనిపై స్థానికుల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత రావడంతో అర్ధాంతరంగా తవ్వకాలను నిలిపి వేయాల్సి వచ్చింది. ‘రంగారెడ్డి జిల్లాలోని చెరువుల్లో మట్టి తోడేళ్లు పడ్డాయి. పగలూ రాత్రి అనే తేడా లేకుండా ఇష్టానుసారంగా మట్టిని తవ్వేస్తున్నాయి. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్, మహేశ్వరం ప్రాంతాలలో ఈ అక్రమ దందా ఎక్కువగా సాగుతోంది. వ్యవసాయ పొలాలు, ఇసుక బట్టీలకు అని చెప్పి అనుమతులు తీసుకుని వెంచర్లకు అక్రమంగా తరలిస్తున్నారు. గోరంత అనుమతులతో కొండంత తవ్వకాలు జరపడంతో పాటు వందలాది టిప్పర్లలో పరిమితికి మించి మట్టిని తరలించి రూ.కోట్లలో అక్రమంగా ఆర్జిస్తున్నారు. కళ్లముందు జరుగుతున్న ఈ అక్రమాన్ని అన్ని శాఖల అధికారులు ‘మామూలు’గానే తీసుకుంటుండడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అక్రమ మట్టి దందా మూలంగా చెరువుల ఉనికి సైతం ప్రశ్నార్థకమవుతోంది.
రూ.కోట్లలో దందా..
చెరువులు, కుంటలలో మట్టిని తోడాలంటే రెవెన్యూ, ఇరిగేషన్, మైనింగ్ శాఖల నుంచి అనుమతులు తప్పనిసరి. అయితే జిల్లాలో చాలా వరకు మట్టి తవ్వకాలు అనుమతులు తీసుకోకుండా జరుగుతున్నవే ఎక్కువ. రాయల్టీని సైతం మొక్కుబడిగానే చెల్లించి అక్రమ దందా మాటున పెద్ద ఎత్తున అక్రమార్కులు లాభపడుతున్నారు. జిల్లాలో పెద్ద ఎత్తున వెంచర్లు ఏర్పాటవుతుండడంతో మట్టికి భారీ డిమాండ్ ఉంది. ఈ క్రమంలోనే కొంతమంది వ్యాపారులు, నేతలు మాఫియా అవతారం ఎత్తుతున్నారు. అధికారులను మామూళ్ల మత్తులో ఉంచి పెద్ద ఎత్తున మట్టి దందాను సాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
ఉదయం నుంచి సాయంత్రం వరకు మాత్రమే మట్టిని తరలించుకోవాల్సి ఉండగా.. పగలు, రాత్రి అనే తేడా లేకుండా తవ్వకాలు జరిపి మట్టిని రవాణా చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, నిఘా పెట్టాల్సిన పోలీసు శాఖ సైతం మిన్నకుండి పోతుండడంతో జిల్లాలో మట్టి దందా మూడు పూలు, ఆరు కాయలుగా సాగుతోంది. ఓవర్ లోడ్‌తో గ్రామాల్లోని రోడ్లు సైతం దెబ్బ తింటున్నాయి. స్థానికుల నుంచి నిరసనలు, ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నప్పటికీ అధికారుల నుంచి ఎటువంటి చలనం లేకపోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కలెక్టర్ స్పందించి ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి నిరంతరం నిఘా పెట్టేలా ఆయా శాఖలను పురమాయించాలని ప్రజానీకం కోరుకుంటోంది.






