ప్రహరీ గోడ లేక విషసర్పాలకు నిలయంగా మారిన బడి.. పట్టించుకునేవారేరి?

by Jakkula.Mamatha |

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని, విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి వసతులు కల్పిస్తామని పాలకులు చెబుతున్న మాటలు క్షేత్రస్థాయిలో నీటి మూటలుగానే మిగులుతున్నాయి.

ప్రహరీ గోడ లేక విషసర్పాలకు నిలయంగా మారిన బడి.. పట్టించుకునేవారేరి?
X

దిశ,తాడ్వాయి: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని, విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి వసతులు కల్పిస్తామని పాలకులు చెబుతున్న మాటలు క్షేత్రస్థాయిలో నీటి మూటలుగానే మిగులుతున్నాయి. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని ఎస్సీ వాడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. ఇక్కడ వంటగది లేకపోవడంతో గత తొమ్మిదేళ్లుగా విద్యార్థులకు ఆరుబయటే, తాటిపత్రెల చాటున మధ్యాహ్న భోజనం వండాల్సిన దుస్థితి నెలకొంది.

​మూడు కట్టెలు.. ఒక తాటిపత్రే వంటగది..

​ఈ పాఠశాలలో ప్రస్తుతం 58 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరికి మధ్యాహ్న భోజనం వండడానికి సరైన వంటగది లేదు.మూడు కట్టెలకు ఒక తాటిపత్రెను అడ్డంగా కట్టి, దాన్నే వంటగదిగా మార్చారు నిర్వాహకులు. గత తొమ్మిదేళ్లుగా ఇదే తంతు సాగుతోంది.గాలి వాన వచ్చినా,ఎండ ముదిరినా ఆరుబయట వంట చేయడం కత్తిమీద సాములా మారింది.

రూ. 4.4 లక్షలు మంజూరైనా.. ముందుకు రాని కాంట్రాక్టర్లు..

​ఈ పాఠశాల వంటగది నిర్మాణానికి ప్రభుత్వం రూ.4.4 లక్షల రూపాయలు మంజూరు చేసినప్పటికీ,కాంట్రాక్టర్లు ఎవరు పనులు చేపట్టడానికి ముందుకు రావడం లేదు. అధికారుల పర్యవేక్షణ లోపం, కాంట్రాక్టర్ల ఉదాసీనత వల్లే నిధులున్నా నిర్మాణం జరగడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.

కూలిన ప్రహరీ.. విషసర్పాలకు ఆవాసం

​పాఠశాల సమస్యలు ఇక్కడితో తీరలేదు. స్కూల్ చుట్టూ ఉన్న ప్రహరీ గోడ పూర్తిగా కూలిపోవడంతో, పాఠశాల ఆవరణ పశువులకు,కుక్కలకు నిలయంగా మారింది. చుట్టూ పొదలు పెరగడంతో విషసర్పాలు, తేళ్లు పాఠశాల లోపలికి వస్తున్నాయని విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ఉపాధ్యాయులు సైతం ఆందోళనలో గడుపుతున్నారు.

తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల వేడుకోలు..

​నిధులు మంజూరైనా వంటగది నిర్మించకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు, ఉన్నతాధికారులు స్పందించి, తక్షణమే వంటగది నిర్మాణాన్ని పూర్తి చేయడంతో పాటు, కూలిపోయిన ప్రహరీ గోడను నిర్మించి విద్యార్థులకు రక్షణ కల్పించాలని పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

తొమ్మిదేళ్లుగా ఇక్కట్లే.. అధికారులు చూసి పోతున్నారే తప్ప పరిష్కారం లేదు: లాలమ్మాల పద్మ, పాఠశాల ఆయా

గత తొమ్మిది సంవత్సరాలుగా స్కూల్లో వంటగది లేకపోవడంతో పిల్లలకు మధ్యాహ్న భోజనం వండాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.ఎండైనా, వానైనా ఆరుబయటే వండాల్సి వస్తోంది. అధికారులు చాలామంది వచ్చి చూసి పోతున్నారు తప్ప,వంటగది నిర్మాణం మాత్రం చేపట్టడం లేదు.ఇక గత్యంతరం లేక, వేరే దారి లేకే ఇలా కట్టెలు పాతి, వాటికి తాడిపత్రి కట్టి గాలి రాకుండా వంట చేస్తున్నాం. ఇప్పటికైనా స్పందించి మా కష్టాలు తీర్చాలి.

ఆదర్శంగా ప్రభుత్వ బడిలో చేర్పిస్తే.. విషసర్పాల మధ్య చదువులా: మెట్టు రాములు, విద్యార్థి తండ్రి, తాడ్వాయి

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో,అందరికీ ఆదర్శంగా ఉండేలా నా ఇద్దరు పిల్లలను ఇదే మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదివిస్తున్నాను. కానీ ఇక్కడ కనీస వంట గది కట్టకపోవడం బాధాకరం.సరైన వంటగది లేక,స్కూల్ చుట్టూ ప్రహరీ గోడ కూలిపోవడంతో పిల్లలు ప్రతిరోజూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.భయాందోళనల మధ్య చదువుకుంటున్నారు. కాంట్రాక్టర్లు మానవత్వంతో స్పందించి,తక్షణమే ముందుకు వచ్చి వంటగది, ప్రహరీ గోడ నిర్మాణ పనులు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు

Next Story