కమిషన్ ఇస్తేనే కాసులు.. రూ.200 కొడితే రూ.1,800..!

by Batti.Sumithra |

కంచే చేను మేసిన చందంగా తయారైంది కొంతమంది ఉపాధి హామీ పనులకు సంబంధించిన అధికారుల తీరు.

కమిషన్ ఇస్తేనే కాసులు.. రూ.200 కొడితే రూ.1,800..!
X

దిశ, డోర్నకల్ : కంచే చేను మేసిన చందంగా తయారైంది కొంతమంది ఉపాధి హామీ పనులకు సంబంధించిన అధికారుల తీరు. నిరుపేదలకు పని కల్పించి వారిని ఆదుకోవాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం క్షేత్రస్థాయిలో కొందరు అవినీతిపరులకు వరంగా మారుతోంది. అమాయక, నిరక్షరాస్య కూలీలనే ఆదాయ వనరులుగా మార్చుకుని కొంత మంది మేట్లు లక్షలు గడిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. డోర్నకల్ మండలంలోని పలు గ్రామాల్లో పనిచేస్తున్న ఒక్కో ఉపాధి కూలీ వద్ద వారానికి రూ.100 నుంచి రూ.200 వరకు కమిషన్ వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రూ.100 కమిషన్ ఇస్తే రూ.1,150, రూ.200 వసూలు చేస్తే తిరిగి వారికి రూ.1,800 చెల్లిస్తున్నట్లు సమాచారం. ఈ తతంగం అంతా కొంతమంది అధికారుల కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

పని చేయకున్నా కొలతలు..

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనుల్లో కూలీల నుంచి వారానికి రూ.100 నుంచి రూ.200 వరకు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు క్షేత్రస్థాయిలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. మస్టర్లు నమోదు చేయడానికి, కొలతలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడానికి మేట్లు (ఫీల్డ్ అసిస్టెంట్లు), సాంకేతిక సహాయకులు (టెక్నికల్ అసిస్టెంట్లు) ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్లు పలువురు కూలీలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మామూళ్లు ఇస్తేనే మస్టర్లు..

పనులు కల్పించడం, మస్టర్లలో పేర్లు నమోదు చేయడం, ఆన్‌లైన్ వ్యవస్థలో వివరాలు నమోదు చేయడానికి కూలీల నుంచి ప్రతి వారం డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు ఇవ్వని కూలీల పనుల కొలతలను కావాలనే తగ్గించి నమోదు చేయడం, వేతనాల్లో కోత విధించడం లేదా వారికి అసలు పనులు అప్పగించకపోవడం వంటి వేధింపులకు గురి చేస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. టెక్నికల్ అసిస్టెంట్లు పని ప్రదేశానికి వెళ్లి సరైన కొలతలు తీసుకోకుండా, కార్యాలయాల్లోనే కూర్చొని ఇష్టానుసారంగా రికార్డులు నమోదు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కమిషన్లకు పాల్పడుతున్న వారిని గుర్తించి రికవరీ చేయాలని ప్రజలు కోరుతున్నారు.

రూ.500 ఇస్తే ఓకే.. లేకుంటే వివక్షే..

ఉపాధి హామీ పనులకు వచ్చే కూలీల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న వైనం సంచలనంగా మారింది. పై సిబ్బందికి ఇచ్చే డబ్బులతో పాటు తనకు అదనంగా రూ.500 ఇవ్వాల్సిందే అంటూ ఓ మేట్ హుకుం జారీ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తన వద్ద పనిచేసే కూలీలు వేల రూపాయలు సంపాదించారని, అందులో నుంచి రూ.500 ఇవ్వాలని ఒత్తిడి చేసినట్లు ఓ బాధితుడు ఆరోపించారు. మేట్ సొంత అవసరాలకు డబ్బులు ఇవ్వకుంటే వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది వసూళ్ల పర్వం జోరుగా సాగుతోందని ఆరోపిస్తున్నారు. అలాగే మేట్ కుటుంబీకులు, ఇతరులకు పని చేయకుండానే ఫొటోలు దించి మస్టర్లు వేస్తున్నట్లు తీవ్ర చర్చ జరుగుతోంది. ఇటీవల సంబంధిత ఉన్నతాధికారికి ఫిర్యాదు వెళ్లిన సందర్భంలో మరోసారి ఇలా జరగకుండా చూస్తామని చెప్పినప్పటికీ, తీరు మారలేదని బాధితులు అంటున్నారు.

ఎంక్వైరీ చేసి కఠిన చర్యలు తీసుకుంటాం.. ఏపీవో పార్థసారథి

ఉపాధి హామీ పథకం పేదల ఆర్థికాభివృద్ధికి తోడ్పడే లక్ష్యంతో కొనసాగుతోంది. కూలీలకు ప్రభుత్వం అందించే సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత గ్రామపంచాయతీ, సంబంధిత సిబ్బందిపై ఉంది. మండలంలో ఉపాధి హామీ పనుల్లో అక్రమాలు చోటుచేసుకుంటున్నట్లు వస్తున్న ఆరోపణలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమగ్ర విచారణ జరిపించి, నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం.

Next Story