రేవంత్ రెడ్డికి స్పై సంతోష్ రావు.. తెలంగాణ జాగృతి చీఫ్ కవిత తీవ్ర ఆరోపణలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-27 07:40:52  IST  )

ఎక్సైజ్, ఫారెస్ట్ అధికారులకు తిరిగి వెనన్స్ ఇవ్వాలని తెలంగాణ జాగృతి చీఫ్, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రేవంత్ రెడ్డికి స్పై సంతోష్ రావు.. తెలంగాణ జాగృతి చీఫ్ కవిత తీవ్ర ఆరోపణలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎక్సైజ్, ఫారెస్ట్ అధికారులకు తిరిగి వెనన్స్ ఇవ్వాలని తెలంగాణ జాగృతి చీఫ్, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇవాళ గంజాయు ముఠా దాడిలో తీవ్రంగా గాయపడి నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య (Sowmya) ఆరోగ్య పరిస్థితని ఆమె కుటుంబ సభ్యులను అడిగి పరామర్శించారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తెలంగాణ (Telangana) రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, నేరగాళ్లు విచ్చలవిడితనంగా రెచ్చిపోతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో గృహ హింస పెరిగిపోతోందని, మహిళా అధికారులకే రక్షణ లేని పరిస్థితి నెలకొందని విమర్శించారు. నేరస్థులకు చట్టాలన్నా, పోలీసులన్నా భయం లేకుండా పోయిందని మండిపడ్డారు. ఎక్సైజ్ పోలీసులు అంటే గంజాయి సరఫరా చేసేవారికి, స్మగ్లర్లకు అస్సలు భయం లేకుండాపోతోందని అన్నారు. అందుకు నిజామాబాద్ (Nizamabad) ఘటనే అద్దం పడుతోందని పేర్కొన్నారు.

వెపన్స్ ఉంటేనే భయపడతారు..

నేరగాళ్లను కట్టడి చేయాలంటే క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో ఎక్సైజ్ (Excise), ఫారెస్ట్ (Forest) అధికారులకు ఉన్న ఆయుధాలను తిరిగి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికారుల దగ్గర వెపన్స్ ఉంటేనే స్మగ్లర్లు, అసాంఘిక శక్తులు భయపడతారని ఆమె అభిప్రాయపడ్డారు. విధి నిర్వహణలో దాడులకు గురవుతున్న అధికారులకు ప్రభుత్వం అండగా నిలవాలని, వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయవద్దని కోరారు. తెలంగాణలో శాంతిభద్రతలను కాపాడటంలో రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించి, పోలీసు యంత్రాంగాన్ని బలోపేతం చేయాలని కవిత డిమాండ్ చేశారు.

రేవంత్‌ రెడ్డికి స్పై.. సంతోష్‌రావు

సీఎం రేవంత్ రెడ్డికి సంతోష్ రావు గూఢచారిగా పని చేస్తున్నారని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యమనేత‌ కేసీఆర్‌తో ఉద్యమకారులను కలవనివ్వకుండా చేసిందే అతడని.. ఆ పాపం ఊరికే పోదని అన్నారు. గద్దర్‌లాంటి వాళ్లు ప్రగతిభవన్‌ గేట్‌ బయట పడిగాపులు కాయాల్సిన పరిస్థితి కలగుజేసింది అతడేనని అన్నారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో సగం ఇడ్లి తిన్నారా.. పూర్తిగా ఇడ్లి తిన్నారా? అన్న సమాచారాన్ని కూడా గుంపు మేస్త్రీకి చేరవేసేది సంతోష్ రావేనని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అతడి గుఢచారిని రేవంత్ రెడ్డి శిక్షిస్తాడని తాను నమ్మడం లేదన్నారు. ఇక సంతోష్‌రావు లాంటి దుర్మార్గుడికి కేటీఆర్, హరీష్ రావు ఎందుకు వత్తాసు పలుకుతున్నారో అర్థం కావడం లేదని కవిత అన్నారు.

Next Story