- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘సంక్రాంతి స్పెషల్ బస్సు’.. ప్రయాణికుల నుంచి అదనపు ఛార్జీలు వసూల్
సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGRTC) ప్రయాణికులకు ఊరట ఇవ్వాల్సిన సమయంలో భారంగా మారింది.

దిశ, గంగాధర: సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGRTC) ప్రయాణికులకు ఊరట ఇవ్వాల్సిన సమయంలో భారంగా మారింది. గంగాధర నుంచి కరీంనగర్‌కు వెళ్లే బస్సు ఛార్జీలను అకస్మాత్తుగా పెంచడంతో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సాధారణ రోజుల్లో గంగాధర–కరీంనగర్ మధ్య బస్ టికెట్ ధర రూ.40గా ఉండగా, సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకుని అదే ఛార్జీని రూ.70లకు పెంచడం పట్ల ప్రయాణికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ఛార్జీ పై ప్రశ్నించగా, ఇది “సంక్రాంతి స్పెషల్ బస్” కావడంతో అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు కండక్టర్ సమాధానం ఇచ్చినట్లు ప్రయాణికులు తెలిపారు. అయితే, స్పెషల్ బస్ అని ఎక్కడా ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా, సాధారణ ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేయడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
‘‘ఇది ప్రజా పరిపాలన..? లేదా ప్రజలను దోచుకునే పరిపాలనా..?” అంటూ ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. టికెట్ ధర పెంపుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఓ ప్రయాణికుడు, తాను ఫోన్ పే ద్వారా చెల్లించిన రూ.70 టికెట్ స్క్రీన్‌షాట్‌ను వాట్సప్ గ్రూపులలో వైరల్ చేస్తున్నాడు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. పండుగ సమయాల్లో ప్రజలు తమ స్వగ్రామానికి చేరుకునేందుకు ఆర్టీసీ సేవలపై ఆధారపడుతుంటారని, అలాంటి సమయంలో ఛార్జీల పెంపు ప్రజల పై అదనపు భారం మోపినట్లేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. తక్షణమే ఈ విషయంపై TGRTC, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి స్పష్టత ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం (Telangana CMO)తో పాటు #tgrtc ను సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తూ ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.






