ప్రమాదంలో గాయపడ్డ పారిశుద్ధ్య కార్మికుడు మృతి

by Batti.Sumithra |

గంగాధర మండలం ఉప్పర మల్యాల గ్రామానికి చెందిన గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడు లంకదాసరి మల్లయ్య గురువారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

ప్రమాదంలో గాయపడ్డ పారిశుద్ధ్య కార్మికుడు మృతి
X

దిశ, గంగాధర : గంగాధర మండలం ఉప్పర మల్యాల గ్రామానికి చెందిన గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడు లంకదాసరి మల్లయ్య గురువారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గత పది రోజుల క్రితం జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో మల్లయ్య తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయన్ను కుటుంబ సభ్యులు కరీంనగర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అయితే, పరిస్థితి విషమించడంతో ఆయన గురువారం మృతి చెందారు. అనంతరం మల్లయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. పారిశుద్ధ్య కార్మికుడు మల్లయ్య మృతి చెందిన విషయం తెలుసుకున్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తక్షణమే కరీంనగర్ సివిల్ ఆసుపత్రికి చేరుకుని, అక్కడ మార్చురీ వద్ద ఉన్న మల్లయ్య కుటుంబ సభ్యులను కలిసి వారిని ఓదార్చారు.

ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకుని, తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం పోస్టుమార్టం ప్రక్రియను త్వరగా పూర్తి చేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించాలని అక్కడి ఆసుపత్రి అధికారులకు, సిబ్బందికి ఎమ్మెల్యే సూచించారు. మల్లయ్య అకాల మరణంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ పేద కుటుంబానికి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తక్షణ సాయంగా అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం రూ. 10,000/- (పది వేల రూపాయలు) నగదును అందజేశారు. ప్రభుత్వ పరంగా రావాల్సిన నష్టపరిహారం త్వరగా అందేలా చూస్తామని, భవిష్యత్తులో ఆ కుటుంబానికి అన్ని విధాలా మరింత అండగా ఉంటామని ఎమ్మెల్యే సత్యం గట్టి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Next Story