రక్త నాళాల ఆరోగ్యానికి అద్భుత ఔషధం.. బీట్‌రూట్!

by Javid Pasha |

బీట్‌రూట్‌లోని నైట్రేట్ నైట్రిక్ ఆక్సైడ్‌గా మారి రక్త నాళాలను విస్తరింపజేసి, రక్తాన్ని శరీరంలోని అన్ని భాగాలకు సమర్థవంతంగా చేరేలా చేస్తుంది.

రక్త నాళాల ఆరోగ్యానికి అద్భుత ఔషధం.. బీట్‌రూట్!
X

దిశ, ఫీచర్స్ : మీకు తెలుసా? మన రక్త నాళాలు (Blood Vessels) మనం ఊహించిన దానికంటే వేగంగా వృద్ధాప్యం చెందుతున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి చాలామంది ఆహారంలో తీసుకునే కేలరీలు, ప్రోటీన్లపై ఫోకస్ చేస్తుంటారు కానీ, శరీరంలో రక్త ప్రసరణ (Circulation)కు ముఖ్యమైన పోషకాలను పెద్దగా పట్టించుకోరు. అదే బీట్‌రూట్. ఇది సహజంగానే డైటరీ నైట్రేట్స్ అధికంగా ఉండే సూపర్‌ఫుడ్ కాబట్టి కూరగా వండుకొని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతోపాటు బ్లడ్ సర్క్యులేషన్ సాఫీగా జరుగుతుంది. ఇంకా ఏయే బెనిఫిట్స్ ఉంటాయో ఇప్పుడు చూద్దాం.

*1.ఆరోగ్యకరమైన రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది : బీట్‌రూట్‌లోని నైట్రేట్స్ నైట్రిక్ ఆక్సైడ్‌గా మారి రక్త నాళాలను విస్తరింపజేసి, రక్తాన్ని శరీరంలోని అన్ని భాగాలకు సమర్థవంతంగా చేరేలా చేస్తుంది. దీని కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు, కోల్డ్‌నెస్(coldness)ను తగ్గిస్తాయి. దీంతో శరీరం అంతా శక్తివంతంగా, తాజాగా అనిపిస్తుంది.

*2. రక్తపోటును సహజంగా నియంత్రిస్తుంది : అధ్యయనాల ప్రకారం, రోజూ బీట్‌రూట్ జ్యూస్ తాగేవారిలో సిస్టాలిక్ బ్లడ్ ప్రెజర్ బాగా తగ్గుతుంది. నైట్రిక్ ఆక్సైడ్ రక్త నాళాలను సడలించడం ద్వారా హైబీపీ సమస్య ఉన్నవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

*3. సహజ శక్తిని (Natural Energy) పెంచుతుంది : కాఫీ లాంటి ఉత్తేజకాలు కాకుండా, బీట్‌రూట్ సహజంగా శక్తిని అందిస్తుంది. మెరుగైన రక్త ప్రసరణ వల్ల ఆక్సిజన్, పోషకాలు శరీర కణాలకు సమర్థవంతంగా చేరతాయి. దీని వల్ల అలసట తగ్గి, రోజంతా ఎనర్జీగా ఉండగలుగుతారు.

*4. వ్యాయామ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది: క్రీడాకారులు, ఫిట్‌నెస్ ఔత్సాహికులు, అధిక శ్రమ శక్తిని ఇష్టపడేవారికి బీట్‌రూట్ ఔషధంలా పనిచేస్తుంది. అందుకే వీరు దీనిని ఎక్కువగా ఇష్టపడతారు. ఇది వ్యాయామ సమయంలో రక్త కణాలను ఆక్సిజన్‌ను మరింత సమర్థవంతంగా అందించి శక్తిని పెంచడంలోనూ సహాయపడుతుంది. బీట్‌రూట్ తరచుగా తీసుకునేవారు ఎక్కువ దూరం పరుగెత్తగలిగలిగే శక్తిని కలిగి ఉంటారని, తక్కువ అలసట అనుభవిస్తారని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి.

*5. మొత్తం కార్డియోవాస్కులర్ ఆరోగ్యాన్ని సపోర్ట్ చేస్తుంది: బీట్‌రూట్‌లోని రక్తపోటు నియంత్రణ, మంచి బ్లడ్ సర్క్యులేషన్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు వంటివన్నీ కలిపి, గుండెపై ఒత్తిడి తగ్గించి, హార్ట్ డిసీజ్ రిస్కును తగ్గిస్తాయి. దీర్ఘకాలికంగా గుండె, రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అందుకే ఆహారంలో భాగంగా బీట్‌రూట్ తప్పక చేర్చుకోండి అంటున్నారు పోషకాహార నిపుణులు. దీనిని కూరగా వండుకొని గానీ, ఉడికించిగానీ, జ్యూస్ రూపంలో గానీ, సలాడ్‌లో కలపడం ద్వారాగానీ తీసుకోచ్చు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story