- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిగ్ బాస్ ఫేమ్, ప్రముఖ నటి ఇంట్లో వ్యాపారి మృతదేహం.. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
ప్రముఖ కన్నడ నటి, బిగ్ బాస్ ఫేమ్ కృషి తపండా నివాసంలో ఓ వ్యాపారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ కన్నడ నటి, బిగ్ బాస్ ఫేమ్ కృషి తపండా ( Krishi Thapanda) నివాసంలో ఓ వ్యాపారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. బెంగళూరులోని ఆర్‌ఆర్ నగర్ (RR Nagar) లో ఉన్న ఆమె అపార్ట్‌మెంట్‌లో వైశాఖ్ (33) అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జాతీయ మీడియా ఇన్‌పుట్స్ ప్రకారం.. బుధవారం రాత్రి ఎలిగెంట్స్ అపార్ట్‌మెంట్‌లోని నటి నివాసానికి వచ్చిన వైశాఖ్.. ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటన జరిగిన సమయంలో కృషి తపండా ఇంట్లో లేనట్లు తెలిసింది. అయితే, బుధవారం రాత్రి వైశాఖ్ ఆమెకు ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడని, ఈ విషయాన్ని ఆమె వెంటనే తన కుటుంబ సభ్యులకు తెలియజేసినట్లు సమాచారం. గురువారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులకు సమాచారం అందింది.
దర్యాప్తు ముమ్మరం..
ఘటనా స్థలానికి చేరుకున్న ఆర్‌ఆర్ నగర్ పోలీసులు ఫోరెన్సిక్ ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. అసహజ మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మృతుడి నేర చరిత్ర..!
మృతుడు వైశాఖ్‌కు వివాదాస్పద నేపథ్యం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలో అరవింద్ రెడ్డి అనే వ్యాపారికి బెదిరింపు లేఖలు పంపిన కేసులో (హెచ్‌ఏఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలో) ఇతను అరెస్ట్ అయినట్లు సమాచారం. అలాగే, భార్యతో కుటుంబ విభేదాల కారణంగా ఆమెకు దూరంగా ఉంటున్న వైశాఖ్.. తరచూ నటి ఇంటికి వస్తుండేవాడని లేదా అక్కడే ఉంటుండేవాడని తెలుస్తోంది. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల కచ్చితమైన కారణాలు తెలుస్తాయని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో నటి కృషి తపండాతో పాటు మృతుడి కుటుంబ సభ్యులను కూడా పోలీసులు విచారించనున్నారు. కాగా, 2014లో ‘మిస్ కర్ణాటక’ కిరీటాన్ని గెలుచుకున్న కృషి తపండా, కార్పొరేట్ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చారు. ‘అకిరా’, ‘కహి’ వంటి చిత్రాలతో పాటు, బిగ్‌బాస్ కన్నడ సీజన్-5లో పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.






