ప్రజలు సహకరిస్తేనే రోడ్డు విస్తరణ : మంత్రి సీతక్క

by Batti.Sumithra |

మంగపేట వై జంక్షన్ నుంచి నర్సాపురం బోరు, సంతోషిమాత గుడి, హనుమాన్ జంక్షన్ వరకు డబుల్ లేన్ రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్, డ్రైనేజీ విస్తరణకు నిధులు మంజూరు చేస్తానని మంత్రి సీతక్క భరోసా ఇచ్చారు.

ప్రజలు సహకరిస్తేనే రోడ్డు విస్తరణ : మంత్రి సీతక్క
X

దిశ, మంగపేట : మండల కేంద్ర ప్రజలు సహకరిస్తే మంగపేట వై జంక్షన్ నుంచి నర్సాపురం బోరు, సంతోషిమాత గుడి, హనుమాన్ జంక్షన్ వరకు డబుల్ లేన్ రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్, డ్రైనేజీ విస్తరణకు నిధులు మంజూరు చేస్తానని మంత్రి సీతక్క భరోసా ఇచ్చారు. గురువారం మండలంలో పర్యటించిన సీతక్క మండల కేంద్రంలోని ఎంపీడీవో భవనానికి కోటి 50 లక్షలతో నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పంచాయతీరాజ్, ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. పంచాయతీరాజ్, రెవెన్యూ కార్యాలయాలు ఒకే చోట ఉండేలా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో మాట్లాడి, రెండు రోజుల్లో రెండు భవనాలను కలిపి ఇంటిగ్రేటెడ్ భవనం నిర్మించేలా చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మండల కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ భవన నిర్మాణం చేపడితే బాగుంటుందనే సూచనల మేరకు చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.

గోదావరి కరకట్ట నిర్మాణం ద్వారా కోతకు గురవుతున్న రైతులకు మేలు చేసే విధంగా పనులు చురుకుగా జరుగుతున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని మంగపేట కేంద్రంగా నూతన పుష్కరఘాట్ నిర్మాణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో భక్తులకు అనుకూలంగా కొత్త పుష్కరఘాట్లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని మల్లూరు హేమాచల లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో రూ.3 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. హామ్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఏటూరునాగారం–భూర్గంపాడు ప్రధాన రహదారి పనులను ఈ వర్షాకాలం ముగిసిన తర్వాత ప్రారంభించి, పుష్కరాల నాటికి పూర్తి చేసి మంగపేట మండల కేంద్రానికి మహర్దశ తీసుకురానున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ భోర్కడే సహదేవరావు, అదనపు కలెక్టర్ మహేందర్ జీ, ఏటూరునాగారం ఏఎస్పీ మనన్ భట్, ఐటీడీఏ పీవో లెనిన్ వత్సల్ టొప్పో, గ్రంథాలయ చైర్మన్ రవిచందర్, మార్కెట్ చైర్మన్ రేగ కల్యాణి, పంచాయతీరాజ్ డైరెక్టర్ గుమ్మడి సోమయ్య, తహసీల్దార్ తోట రవీందర్, ఎంపీడీవో భద్రు, జిల్లా అధికార ప్రతినిధి అయ్యోరి యానయ్య, ఆక రాధాకృష్ణ, మైల జయరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story