అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

by Batti.Sumithra |

జూకల్ గ్రామానికి చెందిన సౌడ కిషన్ అనే వ్యక్తి అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
X

దిశ, చిట్యాల: మండలంలోని జూకల్ గ్రామానికి చెందిన సౌడ కిషన్ అప్పులబాధతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య సౌడ అశ్విని పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన వివరాల ప్రకారం కిషన్ గత రెండేళ్లుగా వ్యవసాయంతో పాటు స్థానికంగా మొక్కజొన్న, పత్తి కొనుగోలు వ్యాపారం చేసేవాడని, ఇటీవల పత్తి పంటకు పురుగు పట్టడం వల్ల తీవ్ర పంట నష్టం వాటిల్లిందని తెలిపింది. దీనికి తోడు వ్యాపారంలో కూడా భారీగా నష్టాలు రావడంతో, వ్యాపార నిర్వహణ కోసం, కుటుంబ అవసరాల కోసం స్థానికంగా తెలిసిన వారి వద్ద పెద్ద మొత్తంలో అప్పులు తీసుకున్నాడని పేర్కొంది. హౌసింగ్ లోన్‌కు సంబంధించిన ఈఎంఐలను కూడా సకాలంలో చెల్లించలేకపోయాడని తెలిపింది. అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై, డిప్రెషన్‌లోకి వెళ్లిన కిషన్, గత వారం వ్యవసాయ చేను వద్దకు వెళ్లి వస్తానని భార్యకు చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన భార్య అశ్విని ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అని రావడంతో ఆందోళన చెంది తన మామయ్య సాంబయ్యకు, కుటుంబ సభ్యులకు విషయం తెలియజేసింది.

అందరూ కలిసి చేను వద్దకు వెళ్లి వెతకగా, కిషన్ అక్కడ పడి ఉండి ప్రాణాపాయ స్థితిలో కనిపించాడు. ఇలా ఎందుకు చేశావని తండ్రి అడగగా, అప్పుల బాధ భరించలేకనే గడ్డి మందు తాగినట్లు కిషన్ తెలిపాడని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. వెంటనే అతడిని చిట్యాల ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. తన భర్త మరణం పై ఎవరిపైనా ఎలాంటి అనుమానాలు లేవని, కేవలం అప్పుల బాధ, ఆర్థిక ఇబ్బందుల వల్లే తన భర్త ఈ నిర్ణయం తీసుకున్నాడని భార్య అశ్విని తన ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా చిట్యాల పోలీసులు చట్టప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సతీష్ తెలిపారు.

Next Story