ఉప్పరపల్లి లబ్ధిదారులకు న్యాయం చేయాలి: మాజీ జెడ్పీటీసీ బాలేష్

by Batti.Sumithra |

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలం ఉప్పరపల్లి గ్రామంలోని నిరుపేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాల విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రెవెన్యూ యంత్రాంగం తక్షణమే అమలు చేయాలని మాజీ జెడ్పీటీసీ బాలేష్ డిమాండ్ చేశారు.

ఉప్పరపల్లి లబ్ధిదారులకు న్యాయం చేయాలి: మాజీ జెడ్పీటీసీ బాలేష్
X

దిశ, మేడ్చల్ బ్యూరో : మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలం ఉప్పరపల్లి గ్రామంలోని నిరుపేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాల విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రెవెన్యూ యంత్రాంగం తక్షణమే అమలు చేయాలని మాజీ జెడ్పీటీసీ బాలేష్ డిమాండ్ చేశారు. గురువారం ఉప్పరపల్లి గ్రామంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉప్పరపల్లి గ్రామ సర్వేనంబర్లు 837, 838లో సుమారు 18 ఎకరాల విస్తీర్ణంలో అప్పటి హుడా ఆధ్వర్యంలో 1999లో 592 ప్లాట్లతో లేఅవుట్‌ను అభివృద్ధి చేశారని తెలిపారు. అనంతరం 2003లో నిరుపేద లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 100 చదరపు గజాల చొప్పున పట్టాలు పంపిణీ చేసినట్లు వివరించారు. ఆ తర్వాత ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం కొంత భూమిని సేకరించడంతో లబ్ధిదారుల ప్లాట్ల విస్తీర్ణం 80 చదరపు గజాలకు తగ్గిందని, 2014లో సవరించిన పట్టాలు అందజేసినట్లు పేర్కొన్నారు.

అయితే, 2018, 2019 సంవత్సరాల్లో ఎలాంటి ముందస్తు నోటీసులు జారీ చేయకుండా అధికారులు స్థలాల్లో చేపట్టిన నిర్మాణాలను కూల్చివేయడంతో బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారని తెలిపారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన హైకోర్టు, పట్టాదారులు నిబంధనలు ఉల్లంఘించినట్లు భావించినప్పటికీ, చట్ట ప్రక్రియను అనుసరించకుండా, ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని స్పష్టం చేసినట్లు చెప్పారు. అలాగే, చట్టబద్ధమైన విధానాన్ని అనుసరించకుండా లబ్ధిదారుల స్వాధీనం, అనుభవంలో అధికారులు జోక్యం చేసుకోవద్దని హైకోర్టు ఆదేశించినట్లు వెల్లడించారు.

దశాబ్దకాలంగా నిరుపేదల ఇళ్ల స్థలాల కోసం తాను పోరాటం కొనసాగిస్తున్నానని బాలేష్ పేర్కొన్నారు. పేదల పక్షాన నిలబడినందుకు తనపై కేసులు నమోదు చేయడం, బెదిరింపులకు పాల్పడడం వంటి పరిణామాలు ఎదురైనా వెనుకడుగు వేయలేదన్నారు. ప్రభుత్వం పేదలకు కేటాయించిన స్థలాలను కాపాడుకోవడం తన బాధ్యతగా భావించి న్యాయపోరాటం సాగించగా, హైకోర్టు తీర్పుతో న్యాయం జరిగిందని తెలిపారు.

స్థలాలను కోల్పోయిన అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం ప్రత్యేక లేఅవుట్ ఏర్పాటు చేసి నూతన పట్టాలు పంపిణీ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. హైకోర్టు ఆదేశాలను అధికారులు తూచా తప్పకుండా అమలు చేసి నిరుపేదల హక్కులను పరిరక్షించాలని కోరారు. హైకోర్టు తీర్పుతో తమకు న్యాయం జరిగిందని, ఎన్నో సంవత్సరాలుగా సాగించిన న్యాయపోరాటానికి ఫలితం దక్కిందని ఉప్పరపల్లి గ్రామానికి చెందిన పలువురు మహిళా లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.

Next Story