Inflation: ఎల్‌నినో ఎఫెక్ట్‌తో భారత్‌కు కొత్త ఆర్థిక పరీక్ష

by S Gopi |

రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి మధ్యప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ వరకు విస్తరించిన వ్యవసాయ బెల్ట్‌లో వర్షాభావం కనిపిస్తోంది.

Inflation: ఎల్‌నినో ఎఫెక్ట్‌తో భారత్‌కు కొత్త ఆర్థిక పరీక్ష
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఆర్థికవ్యవస్థకు ప్రస్తుతం అతిపెద్ద ఆందోళన చమురు లేదా గ్లోబల్ సరఫరా కాదు, ఆలస్యమైన రుతుపవనాలేనని విశ్లేషకులు భావిస్తున్నారు. జూన్‌లో రావాల్సిన వర్షాలు అనేక ప్రాంతాల్లో ఆలస్యమవడంతో ఖరీఫ్ పంటల సాగు దెబ్బతింటోంది. రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి మధ్యప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ వరకు విస్తరించిన వ్యవసాయ బెల్ట్‌లో వర్షాభావం కనిపిస్తోంది. దేశంలోని సోయాబీన్, చెరకు, పత్తి, పప్పుధాన్యాల ఉత్పత్తిలో పెద్ద భాగం ఈ ప్రాంతాల నుంచే వస్తుండటంతో వ్యవసాయ రంగంపై ఒత్తిడి పెరుగుతోంది. ముఖ్యంగా ఉల్లి ఉత్పత్తికి కేంద్రంగా ఉన్న నాసిక్‌లో వర్షపాతం సాధారణ స్థాయి(కేవలం 16 శాతం) కంటే చాలా తక్కువగా నమోదవడం మార్కెట్లను ఆందోళనకు గురిచేస్తోంది. ఇది రాబోయే రోజుల్లో ఉల్లి ధరలను ఆకాశానికి చేర్చి, సామాన్యుడి ఇంటి బడ్జెట్‌ను పెంచడం ఖాయమనే ఆందోళనలు పెరుగుతున్నాయి. సాధారణంగా జూన్ నెలలోనే ముంబైని ముంచెత్తాల్సిన వర్షాలు రెండు వారాలు ఆలస్యం కావడంతో దేశవ్యాప్తంగా ఆందోళన మొదలైంది. రైతులు విత్తనాలు వేయకుండా ఆగిపోవడంతో, దేశ 300 బిలియన్ డాలర్ల వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో పడింది.

ఎల్‌నినో ఎఫెక్ట్.. పెరగనున్న ద్రవ్యోల్బణం

పరిస్థితిని మరింత దిగజారుస్తూ పసిఫిక్ మహాసముద్రంలో 'సూపర్ ఎల్‌నినో' ముప్పు పొంచి ఉంది. ఇది గత 11 ఏళ్లలోనే అత్యంత బలహీన రుతుపవనాల పరిస్థితులకు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల వంట నూనెలు, చక్కెర, పత్తి ధరలు పెరిగి, 2025 నుంచి కొనసాగుతున్న ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచే అవకాశం ఉందని ఆర్‌బీఐ ఇప్పటికే అలర్ట్ చేసింది. గతంలో 2023లో వర్షాలు కురవనప్పుడు ప్రభుత్వం బియ్యం ఎగుమతులను బ్యాన్ చేసి దేశీయ మార్కెట్‌ను కాపాడుకుంది, కానీ దానివల్ల భారత బియ్యంపై ఆధారపడిన ప్రపంచ వాణిజ్యం ఒక్కసారిగా స్తంభించిపోయింది. ఈసారి చక్కెర ఎగుమతులపై కూడా ఇలాంటి ఆంక్షలే వచ్చేలా ఉన్నాయి. నిజానికి మెరుగైన ఎరువుల నిల్వలు, శాస్త్రీయ నీటిపారుదల వల్ల మన ఆహార వ్యవస్థ మునుపటికంటే స్ట్రాంగ్‌గానే ఉంది. కానీ, గ్లోబల్ వార్మింగ్ కారణంగా వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో ఊహించడం అసాధ్యంగా మారింది. ఈ 'సూపర్ ఎల్‌నినో' ప్రభావం కేవలం రైతులపైనే కాదు, ప్రపంచ జనాభాలో నాలుగో వంతు ఉన్న దక్షిణాసియా ప్రజలందరి జేబులపైనా పడనుందని నిపుణులు వెల్లడించారు.

Next Story