అక్రమ పచ్చడి తయారీ కేంద్రం పై టాస్క్ ఫోర్స్ దాడి

by Batti.Sumithra |

వరంగల్ నగరంలోని కాశీబుగ్గ ప్రాంతంలో అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో అక్రమంగా పచ్చడి తయారీ, నిల్వలు నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం మెరుపు దాడి నిర్వహించారు.

అక్రమ పచ్చడి తయారీ కేంద్రం పై టాస్క్ ఫోర్స్ దాడి
X

దిశ, వరంగల్ బ్యూరో : వరంగల్ నగరంలోని కాశీబుగ్గ ప్రాంతంలో అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో అక్రమంగా పచ్చడి తయారీ, నిల్వలు నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం మెరుపు దాడి నిర్వహించారు. ఇంతేజార్‌ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాశీబుగ్గ సాయి వీధిలో ఉన్న ఓ నివాస గృహంలో నిర్వహించిన తనిఖీల్లో పెద్ద ఎత్తున కుళ్లిపోయిన పచ్చడి ముడిసరుకులు, ఆహార పదార్థాలు నిల్వ ఉంచినట్లు గుర్తించారు. వాటిని చిన్న ప్యాకెట్లలో ప్యాకింగ్ చేసి స్థానిక కిరాణా దుకాణాలు, ఇతర చిన్న వ్యాపార కేంద్రాలకు సరఫరా చేస్తున్నట్లు తెలుసుకున్నారు.

ఈ వ్యవహారంలో అరికెల శ్రీనివాస్ (51), కాశీబుగ్గ నివాసిని అదుపులోకి తీసుకున్నారు. దాడిలో 750 కిలోల టమోటా, 900 కిలోల మామిడి, 200 కిలోల నిమ్మకాయలు, 100 కిలోల ఉసిరికాయలు, 150 కిలోల అల్లం-వెల్లుల్లి పేస్ట్‌తో కూడిన మొత్తం రూ.2,25,000 విలువైన కుళ్లిపోయిన, కల్తీ ఆహార నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితుడిని, స్వాధీనం చేసుకున్న సరుకును తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం ఇంతేజార్‌గంజ్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు బ్రాండ్ లేని లేదా అనుమానాస్పద ఆహార పదార్థాలు, పచ్చళ్లను కొనుగోలు చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని టాస్క్ ఫోర్స్ అధికారులు సూచించారు. ఇలాంటి అక్రమ నిల్వ కేంద్రాలు లేదా కల్తీ ఆహార పదార్థాల విక్రయాల పై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. ఈ దాడిని ఏసీపీ టాస్క్ ఫోర్స్ ఎ. మధుసూదన్ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ బండారి రాజు, ఆర్‌ఎస్‌ఐ ఓ. భాను ప్రకాష్, టాస్క్ ఫోర్స్ సిబ్బంది నిర్వహించారు.

Next Story