- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Amazon: మోడీతో భేటీ తర్వాత అమెజాన్ బిగ్ అనౌన్స్‌మెంట్
కంపెనీ సీఈఓ ఆండీ జస్సీ గురువారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సందర్భంగా, 2030 నాటికి దేశంలో అదనంగా 13 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు.

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారత మార్కెట్‌పై తనకున్న దీర్ఘకాలిక నమ్మకాన్ని మరోసారి స్పష్టం చేసింది. కంపెనీ సీఈఓ ఆండీ జస్సీ గురువారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సందర్భంగా, 2030 నాటికి దేశంలో అదనంగా 13 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు. ఈ పెట్టుబడిలో ఎక్కువ భాగం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్లౌడ్ మౌలిక సదుపాయాల నిర్మాణానికి వినియోగించనున్నట్టు స్పష్టం చేశారు. దీంతో 2026-2030 మధ్య భారత్‌లో అమెజాన్ ఏఐ, క్లౌడ్ విభాగాల్లో మొత్తం పెట్టుబడులు 21 బిలియన్ డాలర్లను దాటనున్నాయి. ఇదే సమయంలో కంపెనీ భారత్‌లో అన్ని విభాగాల్లో కలిపి మొత్తం పెట్టుబడుల విలువ 48 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 4 లక్షల కోట్లు)కు పైగా ఉండనుంది.
ప్రధాని మోడీతో దిగిన ఫోటోను ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో షేర్ చేస్తూ, 'భారత్‌లో మా ఫ్యూచర్ ప్లాన్స్ గురించి మోడీ గారితో మాట్లాడటం నిజంగా గ్రేట్ ఎక్స్‌పీరియన్స్' అని జస్సీ ట్వీట్ చేశారు. ఈ కొత్త నిర్ణయంతో, 2010 నుంచి 2030 నాటికి అమెజాన్ భారత్‌లో చేసే మొత్తం పెట్టుబడులు 88 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 7.3 లక్షల కోట్లు) రికార్డు మార్కును దాటనున్నాయి.
కేవలం ఏఐ, క్లౌడ్ కోసమే 21 బిలియన్ డాలర్లు
ఈ మొత్తం పెట్టుబడుల్లో అమెజాన్ ప్రధాన ఫోకస్ అంతా ఏఐ, క్లౌడ్ మౌలిక సదుపాయాల (ఏడబ్ల్యూఎస్) పైనే ఉంది. అందుకే, మొత్తం 48 బిలియన్ డాలర్ల బడ్జెట్‌లో కేవలం ఏఐ, క్లౌడ్ టెక్నాలజీ కోసమే ఏకంగా 21 బిలియన్ డాలర్లను (సుమారు రూ. 1.75 లక్షల కోట్లు) కేటాయించారు. ఈ విభాగం కోసం కొత్తగా 13 బిలియన్ డాలర్లు అదనంగా కేటాయించడం వల్లే ఈ బడ్జెట్ 21 బిలియన్ డాలర్ల మార్కును దాటింది. ఈ మెగా ఇన్వెస్ట్‌మెంట్‌తో దేశంలో 38 లక్షల ఉద్యోగాలకు, 80 బిలియన్ డాలర్ల(రూ. 7.5 లక్షల కోట్ల) ఎగుమతులకు, 1.5 కోట్ల చిన్న వ్యాపారాలకు డిజిటల్ సపోర్ట్ లభించనుంది.
ఇ-కామర్స్ విస్తరణ
టెక్నాలజీతో పాటు తమ ఇ-కామర్స్, క్విక్ కామర్స్ నెట్‌వర్క్‌ను మరింత స్ట్రాంగ్ చేయడానికి ఈ ఏడాది 20 కొత్త ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రాలను, 100కు పైగా లాస్ట్-మైల్ డెలివరీ స్టేషన్లను అమెజాన్ నిర్మిస్తుందని కంపెనీ వెల్లడించింది. ముఖ్యంగా మెట్రో సిటీలే కాకుండా టైర్ 3, టైర్ 4 నగరాలపై ఈసారి ప్రత్యేక దృష్టి సారిస్తామని జస్సీ పేర్కొన్నారు.






